Saturday, July 27, 2024

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

Must Read
  • వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల
    శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ..
  • సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు
  • విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌
  • అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు..
  • ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం
  • ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు ధిక్కార వార‌స‌త్వాన్ని న‌ర‌న‌రాన జీర్ణించుకున్నారు సామాజిక తెలంగాణ, బహుజన ఉద్యమకారుడు, విద్యావేత్త తాడిశెట్టి క్రాంతికుమార్. హ‌న్మ‌కొండ కుమార్‌ప‌ల్లికి చెందిన క్రాంతికుమార్ చిన్న‌త‌నం నుంచే అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నారు. విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేశారు. అనేక నిర్బంధాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వెన‌క‌డుగు వేయ‌లేదు. ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగం వ‌చ్చిన‌ప్ప‌టికీ వ‌దులుకొని స్వ‌రాష్ట్ర సాధ‌న కోసం నిత్యం శ్ర‌మించారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఉద్య‌మ‌కారుడిగా, బ‌హుజ‌నవాదిగా, విద్యాసంస్థల అధినేత‌గానే కాక అనేక సేవా కార్య‌క్ర‌మాల‌తో ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు త‌ల‌లో నాలుక‌గా నిలిచారు. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లి స్థానం నుంచి స్వంతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో నామినేష‌న్ వేసిన క్రాంతికుమార్ త‌న‌దైన శైలి ప్ర‌చారంతో ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, యువ‌కుల ఆశ‌లు, ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తాన‌ని హామీ ఇస్తున్నారు.

ఆద‌ర్శ కుటుంబం..

తాడిశెట్టి క్రాంతికుమార్ త‌ల్లిదండ్రులు తాడిశెట్టి సూర్యకళ – రాజేశ్వర్‌రావు దంప‌తులు హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో ప్ర‌జ‌లంద‌రికీ సుప‌రిచితులు. 1983లో కులాంత‌ర వివాహం చేసుకుని ఆద‌ర్శంగా నిలిచారు. అనేక బహుజన ఉద్యమాల‌కు నాయ‌క‌త్వం వహించారు. అసమానతలులేని స‌మ సమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేశారు. ముఖ్యంగా తొలిద‌శ తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప‌రిత‌పించిన రాజేశ్వ‌ర్‌రావు నిత్యం అరెస్టులు, నిర్బంధాల‌ను ఎదుర్కొన్నారు. కేసుల‌పాలై పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. హ‌న్మ‌కొండ‌లోని మిష‌న్ హాస్పిట‌ల్ ప‌క్క‌న తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వ‌యంగా ఏర్పాటు చేసి అప్ప‌టి ఉద్య‌మ‌కారుల‌తో ఆవిష్క‌రించి అనేక మందిలో ఉద్య‌మస్ఫూర్తిని ర‌గిలించారు. తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌ధి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాటి టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్య‌క్షుడు స్వామిగౌడ్‌తోపాటు ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌భాస్క‌ర్ చేతుల మీదుగా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి భూమి పూజ జ‌రిపించారు. తాడిశెట్టి రాజేశ్వరరావు 1991లో తెలంగాణ ఆంధ్రవాడికి దుబాయ్‌గా మారుతుందని హ‌న్మ‌కొండ‌లోని పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఆనాటి నాయకులు దాస్యం ప్రణయ్ భాస్కర్, బస్వ‌రాజు సారయ్య, జంగ భద్రయ్య లాంటి వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమంపై అవగాహన క‌ల్పించారు.

పోరాట వార‌స‌త్వం..

సారా వ్యతిరేక ఉద్యమంతోపాటు మహిళా విద్యాభివృద్ధికి అనేక పోరాటాలు చేప‌ట్టారు తాడిశెట్టి సూర్యకళ. అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ జీవిత చ‌రిత్ర పుస్త‌కాల‌ను సొంత ఖ‌ర్చుతో అచ్చు వేయించి వేలాది మందికి పంచిపెట్టారు. 1990 ద‌శ‌కంలో హ‌న్మ‌కొండ ప్రాంతంలో మ‌హిళ‌ల‌ను కూడ‌గ‌ట్టి తొలి మ‌హిళా మండ‌ళ్ల‌ను ఏర్పాటుచేసి సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యులుగా నిలిచారు. బ‌తికున్న‌ప్పుడే కాదు చ‌నిపోయి కూడా ప‌దిమందికి
ఉప‌యోగ‌ప‌డాల‌న్న గొప్ప సంక‌ల్పం సూర్య‌క‌ళది. అందుకే మ‌ర‌ణాంత‌రం త‌న నేత్రాల‌ను ఎల్వీ ప్ర‌సాద్ కంటి ద‌వాఖాన‌కు, పార్థివ‌దేహాన్ని కేఎంసీకి అప్ప‌గించారు కుటుంబ‌స‌భ్యులు. స‌మాజ‌మే కుటుంబంగా భావించిన తల్లిదండ్రుల అడుగుజాడ‌ల్లోనే క్రాంతికుమార్ సాగిపోతున్నారు. రెండు ద‌శాబ్దాలుగా ఓరుగ‌ల్లు కేంద్రంగా అనేక ప్రజా ఉద్యమాల‌కు, బహుజన పోరాటాల‌కు నేతృత్వం వ‌హిస్తూ యువ‌త‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేగాక త‌న త‌ల్లిదండ్రుల మాదిరిగానే 2016 డిసెంబ‌ర్ 24న పెరియార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా క్రాంతికుమార్ సుప్ర‌జ‌ను ఆద‌ర్శ వివాహం చేసుకున్నారు. 2023లో మ‌ళ్లీ పెరియార్ వ‌ర్దంతి రోజే క్రాంతికుమార్ త‌మ్ముడు కార్తీక్ త‌న స‌హ‌చ‌రిగా వైష్ణ‌విని స్వాభిమాన వివాహం చేసుకొని ఆద‌ర్శంగా నిలిచారు.

ఉద్యోగం వ‌దిలి ఉద్య‌మంలోకి..

తాడిశెట్టి క్రాంతికుమార్ కుమార్‌ప‌ల్లిలోని న్యూల‌యోలా పాఠ‌శాలలో టెన్త్ చ‌దివారు. హ‌న్మ‌కొండ‌లోనే ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. ఇన్‌ఫోసిస్‌లో ఉన్న‌త ఉద్యోగం వదిలేసి మ‌లి ద‌శ తెలంగాణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. క్రాంతికుమార్ తాను చదువుకున్న న్యూల‌యోలా పాఠ‌శాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తీసుకొని హన్మకొండ పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అభయహ‌స్తం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో కనీసం వెహికిల్స్ లేని ప్రాంతాల్లోకి కాలినడకన వెళ్లి స్మైల్ కిట్టు పేరుతో 21 ర‌కాల నిత్యావ‌స‌ర వస్తువుల‌ను వేలాది గిరిజన కుటుంబాలకు అందించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. అలాగే తాండాల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తూ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ వైద్యావ్యాప్తికి త‌న‌వంతుగా కృషి చేస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తే తన సగం జీతం విద్యావ్యాప్తి కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతాన‌ని క్రాంతికుమార్ పేర్కొంటున్నారు. అలాగే రైతులు, విద్యార్థులు, మహిళా సమస్యలపై గొంతెత్తి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషిచేస్తాన‌ని హామీ ఇస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img