అక్షరశక్తి, హనుమకొండ : ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అదనపు బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీదారులు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో అదనంగా వెయ్యి బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల కమిషన్ కేటాయించగా సప్లమెంటరీ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో అలసత్వం తగదని, పోలింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు నారాయణ, వెంకటేష్, హన్మకొండ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఆర్ఐ జంగం కృష్ణ, సంబంధిత అధికారులతో పాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిపివేత..
నయీంనగర్‌లో కొత్తగా చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిడ్జిని తీసివేయడం వల్ల తాము ఓటింగ్ వేయడానికి మార్గంలేక ఇబ్బంది పడుతున్నామని రాజాజీ నగర్ కాలనీవాసులు కోరుతున్నారు. ఓటింగ్ తర్వాత బ్రిడ్జి మరమ్మతులు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దృష్టికి తీసుకొని వెళ్లగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె హన్మకొండ ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం అధికారులు రంగంలోకి దిగి బ్రిడ్జి నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జంగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.