- హెచ్‌ఎం జంగా గోపాల్‌రెడ్డి సారే ఆదర్శం
- ఆస్తులు కాదు.. ఆప్తులను సంపాదించుకున్నా..
- పిల్లలందరికీ సమాన విద్య అందాలి
- అందుకోసమే ఆజంనగర్ నుంచి హన్మకొండకు వచ్చా..
- ఎస్‌ఎస్ విద్యాసంస్థల అధినేత గూడెపు రమేశ్
- అక్షరశక్తితో మాటామంతి
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలంటేనే ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం బలంగా ఉంటుంది. ధనార్జనే ధ్యేయంగా బతుకుతారని, దోపీడిదారుల్లా పీడిస్తారని… నిజానికి చాలామంది అలాగే ఉంటారు, ఉన్నారు కూడా. కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ కొందరు ఉంటారు. విద్యను వ్యాపారంగా కాకుండా, సామాజిక బాధ్యతగా గుర్తిస్తారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలువేస్తారు. వారి ఎదుగుదలే తమ ఉన్నతికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి కోవకు చెందుతారు ఎస్‌ఎస్ విద్యాసంస్థల అధినేత గూడెపు రమేశ్.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తులున్నప్పటికీ, ఉద్యోగం సాధించే అర్హతలున్నప్పటికీ, వ్యాపారంలో నిలదొక్కుకునే వనరులున్నప్పటికీ అవేవీ తనకు తృప్తినివ్వలేవని అంటున్నారు. కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతుంటే తనకు తెలియకుండానే రూ.34 లక్షలను పోగేసి బిల్లుకట్టిన విద్యార్థులున్న తనకంటే గొప్ప ధనవంతులెవరుంటారని ప్రశ్నిస్తున్నారు. హన్మకొండలో ప్రముఖ విద్యాసంస్థ, ఎస్‌ఎస్ హైస్కూల్ కరస్పాండెంట్ గూడెపు రమేశ్ అక్షరశక్తితో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లలోనే..
చదువుకున్న బడిలోనే పాఠాలు చెప్పా..
మాది భూపాలపల్లి జిల్లా ఆజంనగర్.. గూడెపు రాజయ్య, కొమురమ్మ అమ్మానాన్న. మాది వ్యవసాయాదారిత కుటుంబం. నాన్నకు చదువంటే చాలా ఇష్టం. నాతోపాటు తమ్ముడు, ఇద్దరు అక్కలను కూడా చదివించారు. సొంతూరులోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయింది. హన్మకొండ ఎస్సార్ కళాశాలలో ఇంటర్ చదివా. ఇప్పుడున్నట్లు ప్రైవేట్ కాలేజీలు లేకపోవడంతో ఎంసెట్‌లో 2000 ర్యాంక్ వచ్చినప్పటికీ ప్రభుత్వ కళాశాలలో సీటు రాలేదు. ఈక్రమంలోనే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నాన్నకు అండగా ఉండేందుకు ఊరిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆజంనగర్ హైస్కూల్‌లో గ్రామస్తుల కోరిక మేరకు పారా టీచర్‌గా చేరా. బడికి వెళ్తూనే హన్మకొండ కేడీసీలో డిగ్రీ కంప్లీట్ చేశా. 1996 నుంచి 2001 వరకు నెలకు రూ.600 వేతనంతో పాఠాలు చెప్పా.. 2001లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశా. చదువంటే పట్టాలు సాధించడం మాత్రమే కాదు. చదువంటే సంపూర్ణ జ్ఞానం. అలాంటి విద్యార్థులను తయారు చేయాలని, ఇందుకోసం సొంతంగా పాఠశాల స్థాపించాలని నిర్ణయించుకున్నా. హెచ్ ఎం జంగా గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం తనకు ఆదర్శం. అందుకే ఆజంనగర్ నుంచి హన్మకొండకు వచ్చా.
84 మంది పిల్లలతో ..
హన్మకొండ పోచమ్మకుంటలో సంపత్ సార్‌తో కలిసి సమత హైస్కూల్‌ను తీసుకున్నా. మొదట 84 మంది పిల్లలతో రెంట్ పర్పస్‌లో బిల్డింగ్ తీసుకుని పాఠశాల ప్రారంభించా. మొదటి సంవత్సరమే టెన్త్ పరీక్షల్లో 11 మందికిగాను ఆరుగురు 500 మార్కులు సాధించారు. ఆ తర్వాత సంవత్సరం విద్యార్థుల సంఖ్య 284కి చేరింది. నెక్స్ట్ ఇయర్‌లో సాయికృష్ణ అనే విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. దీంతో అంచెలంచెలుగా పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. స్కూల్ పేరుతోపాటు నాపేరు ప్రజలకు పరిచయమైంది. పాఠశాల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే ఓనర్ రెంట్ పెంచడంతో సొంత భవనంలోకి మారాలని నిర్ణయించుకున్నా. ఈక్రమంలోనే మిత్రుడు, మాజీ కార్పొరేటర్ అనిశెట్టి మురళి సహకారంతో ఆయన స్థలంలో టెంపరరీగా 2007లో పాఠశాల నిర్వహించా. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడంతో మురళి సహాయసహకారాలతో పర్మినెంట్ బిల్డింగ్‌లోకి మార్చా. ఇప్పటి వరకు 84 మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేత సిబ్బంది పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తున్నాం. లాభాపేక్ష కాకుండా, పేద వాళ్లతోపాటు అనేకమంది అనాథలకు 1 నుంచి 10 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం.
కోటి రూపాయలు జీతం తీసుకుంటున్నారు
మా పాఠశాల విద్యార్థులు అనేకమంది గొప్పగొప్ప స్థాయిలో స్థిరపడ్డారు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు మొదలుకుని సంవత్సరానికి కోటి రూపాయల ప్యాకేజ్ తీసుకునే సాఫ్ట్ వేర్ ఇంజీనీర్లు కూడా ఉన్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలుగా పలువురు రాణిస్తున్నారు. నేను కోట్ల రూపాయలు సంపాదించలేదు… కానీ, కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు గురువుననే భావన సంతృప్తినిస్తుంది. ఆజంనగర్ నుంచి హన్మకొండకు వచ్చినప్పటికీ నాకు విద్యాబుద్ధులు నేర్పి, నన్ను సమాజానికి పరిచయం చేసిన మా ఊరి పాఠశాలను మరిచిపోలేదు. విద్యార్థుల కోసం గెస్ట్ టీచర్లకు జీతాల కోసం పూర్వ విద్యార్థుల సహకారంతో ఆర్థిక సహకారం అందిస్తున్నాం. పెద్దలు, దాతల సహకారంతో మా ఊరి సర్కార్ బడిని ఇంకా అభివృద్ధి చేయాలి. అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే నా ఆశయం.
ఆ సంఘటన జీవితంలో మరువను..
కొవిడ్ సమయంలో నేనెదుర్కొన్న ఓ సంఘటన జీవితంలో ఎన్నటికీ మర్చిపోను. మూడు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తిలో అంతటి సంతృప్తినిచ్చిన, గర్వంతో మురిసిపోయిన ఘటన మరోటిలేదు. కరోనా సోకి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరా. రమేశ్ సార్ హాస్టటల్ చేరారన్న విషయం తెలుసుకున్న మా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఏకమై నాకు తెలియకుండానే నా అకౌంట్ నంబర్‌కు అక్షరాల రూ. 34 లక్షలను ట్రాన్స్‌పర్ చేశారు. కార్పొరేటర్ సోదా కిరణ్‌తోపాటు శ్లోక స్కూల్ కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి కలిసి హాస్పిటల్‌లో బిల్లు చెల్లించి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వారందరికీ తిరిగి డబ్బులు చెల్లించా. పాఠశాల స్థాపించి ఇన్నేండ్లవుతున్నా నగరంలో సొంత ఇల్లు, గజం జాగ కూడా సంపాదించుకోలేకపోయిన నాకు విద్యార్థులు, స్నేహితులు చేసిన సాయం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇంకా ఎన్ని ఆర్థిక ఇబ్బందులెదురైనా ముందుకు నడవాలన్న స్థైర్యాన్ని నింపింది. మరోమారు నాకు సామాజిక బాధ్యతను గుర్తుకుతెచ్చింది. ఆస్తులకంటే ఆప్తులను సంపాదించుకున్న వారే కదా గొప్పవాళ్లు అన్న సూక్తిని జ్ఞప్తికి తెచ్చింది. ఇంతకంటే ఒక ఉపాధ్యాయుడికి దక్కే గౌరవం ఏముంటుంది.