Saturday, July 27, 2024

చైర్మ‌న్ మ‌ధు.. జ‌ర్నీవిత్ గంగుల‌!

Must Read
  • కూలీ నుంచి ఎదిగిన రెడ్డ‌వేణి మ‌ధు
  • క‌ష్ట‌న‌ష్టాల‌కు కుంగిపోకుండా ముంద‌డుగు..
  • అండ‌గా నిలిచిన స్నేహితులు
  • గంగుల క‌మ‌లాక‌ర్ ప్రియ‌శిష్యుడిగా గుర్తింపు
  • క‌రీంన‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా అవ‌కాశం
  • జూలై 13న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న మ‌ధు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: ఎదురైన క‌ష్టాల‌ను త‌ల‌చుకుంటూ ఆ యువ‌కుడు కుంగిపోలేదు. మ‌రింత ఉత్సాహంతో క‌దిలాడు. ఓ ఏజెంట్ చేసిన మోసానికి అక్క‌డే ఆగిపోలేదు. స్నేహితుల సాయంతో మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో అడుగుముందుకు వేశాడు. గ్రానైట్ కంపెనీలో రోజుకు 18 రూపాయ‌ల కూలీగా ప‌నిచేసి, అంచెలంచెలుగా ఎదిగాడు. రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రియ‌శిష్యుడిగా, అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందాడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? మ‌రెవ‌రో కాదు రెడ్డ‌వేణి మ‌ధు. అనేక ఏళ్లుగా త‌న అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌, త‌న‌ను న‌మ్ముకుని వెంట వ‌స్తున్న‌ మ‌ధుకు క‌రీంన‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా గంగుల క‌మ‌లాక‌ర్‌ స‌ముచిత స్థానం క‌ల్పించారు. జూలై 13వ తేదీన మ‌ధు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌తినిధితో మ‌ధు ప్ర‌త్యేకంగా మాట్లాడారు. తన కుటుంబం, ఎదుర్కొన్న ఇబ్బందులు, స్నేహితుల సాయం, గంగుల‌తో ప్ర‌యాణం.. ఇలా అనేక విష‌యాల‌ను పంచుకున్నారు.

  • అనేక క‌ష్టాల నుంచి…
    రెడ్డ‌వేణి మ‌ధు స్వ‌గ్రామం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం బావుపేట‌. త‌ల్లిదండ్రులు వ‌జ్ర‌మ్మ‌- స‌త్త‌య్య‌. మ‌ధుకు ఐదుగురు అక్క‌లు, ఇద్ద‌రు అన్న‌లు, ఒక చెల్లెలు ఉన్నారు. పేద కుటుంబం. త‌ల్లిదండ్రులు గ్రామంలోనే బండ ప‌నికి వెళ్తూ కుటుంబాన్ని పోషించారు. ఈ క్ర‌మంలోనే కుటుంబం అనేక ఆర్థిక‌ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ది. ఒకానొక ద‌శ‌లో మ‌ధు కూడా బండ‌కొట్టే ప‌నికి వెళ్తూ త‌ల్లిదండ్రుల‌కు చేదోడువాదోడుగా ఉన్నాడు. బావుపేట స‌మీపంలో ఉన్న శ్వేత‌ గ్రానైట్ కంపెనీలో మ‌ధు రోజువారీ కూలీగా ప‌నిచేశాడు. రోజుకు 18రూపాయ‌లు, కొంత‌కాలానికి రూ.35 కూలికి కూడా ప‌నికి వెళ్లాడు. ఇలా ఒక వైపు చ‌దువు కొన‌సాగిస్తూనే మ‌రోవైపు కుటుంబానికి అండ‌గా నిల‌వ‌డానికి ప‌నిచేస్తూ అనేక క‌ష్టాలు ఎదుర్కొన్నారు.
  • దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే 17 రోజులు
    2007లో బ‌తుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ముంబాయి నుంచి దుబాయ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన త‌ర్వాత‌.. ఏజెంట్ మోసం చేయ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాడు. ఏం చేయాలో.. ఎక్క‌డికి వెళ్లాలో.. ఏం మాట్లాడాలో తెలియ‌క బిక్కుబిక్కుమనుకుంటూ ఎయిర్‌పోర్టులోనే ఏకంగా 17 రోజులు గ‌డిపారు. చివ‌ర‌కు దుబాయ్‌లో ఉంటున్న స్నేహితులు నేరెళ్ల రూపేష్‌, ర‌వియాద‌వ్‌ టికెట్లు బుక్ చేయ‌డంతో తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని, వారు చేసిన సాయం త‌న జీవితంలో ఎన్న‌డూ మ‌ర‌వ‌లేన‌ని మ‌ధు ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దుబాయ్ ఘ‌ట‌న‌తో జీవితంలో ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌న్న ప‌ట్టుద‌ల మ‌ధులో మ‌రింత‌గా పెరిగింది. ఎన్నిక‌ష్టాలు ఎదురైనా వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకుసాగాల‌న్న సంక‌ల్పంతో మ‌ళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
  • గంగుల‌తో ప్ర‌యాణం..
    గ్రామంలోని గ్రానైట్ కంపెనీలో ప‌నిచేస్తూనే.. స్నేహితుడు మ‌ణి, రాజ‌కీయ గురువు క‌డారి శ్రీ‌నివాస్‌ ద్వారా మ‌ధు రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. టీడీపీ అనుబంధ సంస్థ అయిన తెలుగు యువ‌త‌లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు కార్పొరేట‌ర్‌గా ఉన్న గంగుల క‌మ‌లాక‌ర్‌ మ‌ధు ఉత్సాహాన్ని, ఆత్మ‌విశ్వాసాన్ని గుర్తించి ప్రోత్స‌హించారు. క‌రీంన‌గ‌ర్‌ రూర‌ల్ మండ‌లానికి రెండుసార్లు తెలుగు యువ‌త అధ్య‌క్షుడిని చేశారు. కొంత‌కాలానికి గంగుల‌కు మ‌ధు మ‌రింత‌ ద‌గ్గ‌ర‌య్యారు. గంగుల‌తో ఇలా మొద‌లైన ప్రయాణం.. మ‌ధును మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్లింది. ఆయ‌న‌ ఎదుగుద‌ల‌లో కీల‌క పాత్ర పోషించింది. ప‌నిచేసుకుంటూనే గ్రానైట్ కంపెనీలో టు బై వ‌న్ గా చేరిన మ‌ధు.. ఇక వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. సొంతంగా కొన్ని లారీలు తీసుకుని గ్రానైట్ లారీ అసోసియేష‌న్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షులుగా 2010 నుంచి కొన‌సాగుతున్నారు. అసోసియేష‌న్‌లో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. వెంట‌నే స్పందించి, వారికి అండ‌గా ఉండ‌డంలో మ‌ధు ముందుంటున్నారు.
  • క‌రీంన‌గ‌ర్ మ‌ర్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా…
    గంగుల‌తో క‌లిసి టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు మ‌ధు. అన‌తికాలంలోనే గంగుల క‌మ‌లాక‌ర్ న‌మ్మిన‌బంట్ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గంగుల గెలుపు కోసం అహ‌ర్నిశలు శ్ర‌మించారు. త‌న‌కు గంగుల క‌మ‌లాక‌ర‌న్న త‌ప్ప త‌న‌కు మ‌రో రాజ‌కీయ నాయ‌కుడు తెలియ‌ద‌ని, అన్న కోస‌మే బ‌తుకుతాన‌ని, అన్న‌కోస‌మే ప‌నిచేస్తాన‌ని, అన్న కోసం ఎక్క‌డివ‌ర‌కైనా వెళ్తాన‌ని ఈ సంద‌ర్భంగా మ‌ధు అభిమానాన్ని చాటారు. ఇలా త‌న‌ను న‌మ్ముకుని ఉంటున్న మ‌ధుకు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ అపార‌మైన గౌర‌వం ఇచ్చారు. క‌రీంన‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా మ‌ధుకు స‌ముచిత స్థానం క‌ల్పించారు. జూలై 13వ తేదీన మ‌ధు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఇంత‌టి స్థానం క‌ల్పించినందుకు సంతోషంగా ఉంద‌ని, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర‌న్న‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని ఈ సంద‌ర్భంగా మ‌ధు అంటున్నారు. ఇదేస‌మ‌యంలో త‌న స్నేహితుల‌ను మ‌ధు గుర్తు చేసుకున్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆదుకున్నార‌ని వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img