Friday, September 13, 2024

శ్వేత సంక‌ల్పం!

Must Read
  • ఎస్‌హెచ్‌జీలో సాధార‌ణ స‌భ్యురాలిగా ప్ర‌స్థానం
  • ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుగు వేసిన మోటూరి శ్వేత‌
  • కొద్దికాలంలోనే గ్రామ‌స్థాయి నుంచి జిల్లా స‌మాఖ్య అధ్య‌క్ష‌రాలిగా..
  • అంద‌రి స‌హ‌కారంతో స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌
  • న‌ర్సంపేట మండ‌ల స‌మాఖ్య‌కు జాతీయ అవార్డు రావడంలో కీల‌క పాత్ర‌
  • కేంద్ర మంత్రి నుంచి ఆత్మ‌నిర్బ‌ర్ సంఘ‌ట‌న్‌ అవార్డు అందుకున్న శ్వేత టీమ్‌
  • అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : స్వ‌యం కృషి, ప‌ట్టుద‌ల‌, దృఢ‌సంక‌ల్పం.. ఈ మూడు ఎంచుకున్న రంగంలో మ‌న‌ల్ని ఉన్న‌తులుగా తీర్చిదిద్దుతాయి.. అని అంటారు స్వామీ వివేకానంద‌. ఈ మాట‌ల్ని నిజం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్య అధ్య‌క్షురాలు మోటూరి శ్వేత‌. సాధార‌ణ మ‌హిళ‌గా స్వ‌యం స‌హాయ‌క సంఘంలో చేరిన ఆమె.. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా.. త‌న క‌ర్త‌వ్యాన్ని మ‌ర‌వ‌కుండా ముంద‌డుగు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. స‌భ్యులు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల స‌హకారంతో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర్సంపేట ఆద‌ర్శ మండ‌ల సమాఖ్య‌కు జాతీయ స్థాయి అవార్డును సాధించి, ఎంత‌టి బాధ్య‌త‌నైనా మ‌హిళ‌లు అత్యంత‌ స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌ర‌ని నిరూపించారు. ఇలా సంఘాల‌ను బ‌లోపేతం చేస్తూ, స‌భ్యుల బాగోగులు చూసుకుంటూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న మోటూరి శ్వేత ప్ర‌స్థానంపై ప్ర‌త్యేక క‌థ‌నం..
  • స‌భ్యురాలిగా ప్ర‌స్థానం..
    వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మండ‌లం గురిజాల గ్రామంలోని చంద‌న‌ డ్వాక్రా సంఘం స‌భ్యురాలిగా మోటూరి శ్వేత చేరారు. ఆ త‌ర్వాత ఆ సంఘానికి అధ్య‌క్షురాలిగా ఆమెను సభ్యులు ఎన్నుకున్నారు. కొంత‌కాలానికి గ్రామంలోని దేవిక గ్రామైక్య సంఘానికి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. స‌భ్యులు, సంఘాల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా, ఆత్మ‌స్థైర్యంతో ముందుకు సాగారు. గ్రామంలో ఉన్న‌ సమాఖ్య భవనం అభివృద్ధికి కృషి చేశారు. తన సొంత డ‌బ్బుల‌తో మొరం పోయించారు. కరోనా క‌ష్ట‌కాలంలో సొంత‌ ఖర్చుల తో ప్ర‌జ‌ల‌కు మాస్కులు పంపిణీ చేశారు. క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇలా కొంత‌కాలంలోనే శ్వేత ప‌నివిధానంతో దేవిక‌ గ్రామైక్య సంఘానికి మండ‌లంలో మంచి గుర్తింపు ల‌భించింది. దీంతో అన్ని గ్రామాల గ్రామైక్య సంఘాల‌ అధ్యక్షులు ఆమెను నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
  • ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్య అధ్య‌క్షురాలిగా..
    వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కలిగిన 11 మండలాలతో ఓరుగల్లు మహా సమాఖ్య కొన‌సాగుతోంది. ఇందులో నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్య భాగస్వామిగా ఉంది. గత ఏడాది ఓరుగల్లు మహా సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా శ్వేతను కోశాధికారిగా ఎన్నుకున్నారు. అధికారులు, పాలకవర్గం, సభ్యుల సహకారంతో విధులు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఉన్న ఎస్‌హెచ్‌జీ, దేవిక గ్రామైక్య సంఘం, న‌ర్సంపేట ఆద‌ర్శ మండ‌ల స‌మాఖ్య అధ్య‌క్షురాలిగా త‌న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తూ, సంఘాల‌ను బ‌లోపేతం చేస్తున్న శ్వేత‌ను 19-10-2021న‌ నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో ఓరుగల్లు మహా సమాఖ్యకు అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
  • క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేక స్టాల్‌
    ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత సభ్యులు, అధికారులు, వరంగల్ కలెక్టర్ సహకారంతో కలెక్టర్ కార్యాలయంలో స‌మాఖ్య త‌రుపున ప్ర‌త్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. మహిళలు స్వతహాగా తయారు చేసిన తినుబండారాలు, వస్తువులు అమ్మడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ లో మహిళలు తయారు చేసిన పిండి వంటలు, పచ్చళ్లు తదితర వస్తువులు అమ్ముతున్నారు.
  • జాతీయ స్థాయిలో అవార్డు..
    మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బహుమతులు ప్రదానం చేయడానికి ఈ ఏడాది దేశంలో పనిచేస్తున్న మండల సమాఖ్యలను వాటి పని తీరు ఆధారంగా ఎన్నిక చేశారు. దేశం మొత్తంలో 13 సంఘాలు ఎన్నిక చేశారు. అందులో తెలంగాణ నుండి రెండు సంఘాలు ఎన్నిక చేశారు. ఒకటి నర్సంపేట మండల సమాఖ్య, రెండోది రంగారెడ్డి జిల్లాలోని మండల సమాఖ్య. నర్సంపేట మండల సమాఖ్య అధ్యక్షురాలుగా ఉండి అధికారులను సమన్వయం చేసుకుంటూ మండలంలో అన్ని గ్రామాల్లో బ్యాంకు రుణాల చెల్లింపుల్లో ఒక్కరు కూడా బాకీ లేకుండా తీసుకవచ్చారు. అదేవిధంగా బ్యాంకు లింకేజీ రుణాలు అధికారులు విధించిన టార్గెట్ కంటే ఎక్కువగా చేశారు. సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అవార్డు కు ఎంపిక చేసింది.
  • అంద‌రి స‌హ‌కారంతోనే..
    అయితే.. ఈ అవార్డు.. నా ఒక్క దాని వల్ల రాలేదు. మండల సమాఖ్యలో నాతోపాటు పని చేస్తున్న అంద‌రి స‌హ‌కారం వ‌ల్లే ఆత్మ నిర్బర్ సంఘటన్ అవార్డు మండల సమాఖ్యకు వచ్చిందని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు అధ్యక్షురాలు మోటూరి శ్వేత. అవార్డును ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఏపీఎం, కార్యవర్గం జ్ఞాపిక‌, లక్ష రూపాయల ప్రైజ్ మ‌నీ అందుకోవడం జీవితంలో మర్చిపోలేని గౌరవమ‌ని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మండల సమాఖ్య అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డికి, జిల్లా క‌లెక్ట‌ర్‌, డీఆర్‌డీవో, అధికారులంద‌రికీ శ్వేత కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. మహిళ సంఘాలకు ఎలాంటి కండిషన్లు లేకుండా రుణాలు ఇస్తున్నారని, వాటిని ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె సూచిస్తున్నారు.
  • జ‌మ్ముక‌శ్మీర్ నుంచి ప్ర‌త్యేక బృందం
    నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్యకు ఆత్మ నిర్బర్ సంఘటన్ అవార్డు వ‌చ్చిన నేపథ్యంలో సమాఖ్య పని తీరు తెలుసుకోవడానికి జమ్ముక‌శ్మీర్ రాష్ట్రం నుండి మహిళలు ఇక్క‌డికి వ‌చ్చారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుండి, ఇతర ప్రాంతాల నుండి న‌ర్సంపేట‌కు వ‌చ్చి.. అనేక విష‌యాలు తెలుసుకుని ప్ర‌శంసించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img