Thursday, September 19, 2024

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

Must Read

– మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
– వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి
– బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం
– విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు
– వివిధ రంగాల నిపుణుల‌తో నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్ టీమ్
– పేద విద్యార్థుల‌కు విద్య‌, ఉపాధి క‌ల్ప‌నపై ఫోక‌స్

అక్ష‌ర‌శ‌క్తి, వంరంగ‌ల్: బిడ్డా.. అమ్మా నేను.. పొద్దంతా క‌ష్టం చేస్తేనే పంట పండుతుంది.. నువ్వు కూడా క‌ష్టప‌డి బాగా చ‌దువుకోవాలి.. మ‌న జీవితాల‌ను తీర్చిదిద్దేది చ‌దువొక్క‌టే.. అవ‌కాశం ఎప్పుడు ఎలా వ‌స్తుందో తెలియ‌దు.. నిరంతరం అప్ర‌మ‌త్తంగా ఉంటూ అందిపుచ్చుకోవాలి.. ఎద‌గాలి.. న‌లుగురికి సాయం చేయాలి.. ఆప‌ద‌లో అండ‌గా నిల‌వాలి.. అంటూ నిత్యం నాన్న చెప్పిన మాట‌లే స్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నాడు సైంటిస్టు ముడావ‌త్ మోహ‌న్‌. మారుమూల తండాలో జ‌న్మించిన మోహ‌న్‌.. గురుకుల పాఠ‌శాల‌లో గ‌ణిత ఉపాధ్యాయుడు జీ వెంక‌టేశ్వ‌ర్‌రావు ప్రోత్సాహంతో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాడు. దేశంలోనే ప్ర‌తిష్టాక‌మైన వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉన్న‌త ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం, కుటుంబానికే ప‌రిమితం కాకుండా.. త‌న‌వంతు సామాజిక బాధ్య‌త‌నూ నెర‌వేరుస్తున్నాడు. జై విజ్ఞాన్ – జై భార‌త్ నినాదంతో బీటెక్‌లో ఉండ‌గానే నేష‌న్స్ ఫ‌స్ట్ హ్యూమ‌న్ చైన్ ఫౌండేష‌న్ స్థాపించాడు. వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ నిపుణుల‌తో నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్‌ టీమ్ ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు విద్య‌, ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌లో తోడుగా ఉంటూ.. ఆరోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.

మారుమూల తండా
ముడావ‌త్ మోహ‌న్ స్వ‌గ్రామం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం తౌర్య‌తండా (హ‌రిశ్చంద్రుతండా). త‌ల్లిదండ్రులు శాంతి – భ‌ద్రునాయ‌క్‌. ఉన్న కొద్దిపాటి వ్య‌వ‌సాయం చేసుకుంటూ కొడుకు మోహ‌న్‌, ముగ్గురు కూతుళ్ల‌ను చ‌దివించారు. మోహ‌న్‌ ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు కోమ‌టిప‌ల్లి శివారులో పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. మెరిట్ మార్కుల ఆధారంగా గూడూరు మండ‌లం దామ‌ర‌వంచ ట్రైబ‌ల్ వెల్ఫేర్ గురుకుల పాఠ‌శాల‌లో చేరారు. మోహ‌న్ తెలివితేట‌ల‌ను గ‌మ‌నించిన‌ గ‌ణిత ఉపాధ్యాయుడు జీ వెంక‌టేశ్వ‌ర్‌రావు నిరంత‌రం ప్రోత్స‌హించాడు. అన్నీతానై అండ‌గా నిలిచారు. ఈ క్ర‌మంలో ప‌దో త‌ర‌గ‌తిలో మోహ‌న్‌ మండ‌ల టాప‌ర్‌గా నిలిచారు. గురువు వెంక‌టేశ్వ‌ర్‌రావు విజ‌య‌వాడ‌లోని ఓ ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లో మోహ‌న్‌ను చేర్పించి, ఇంట‌ర్‌తోపాటు ఐఐటీ కోచింగ్ ఇప్పించారు. ఇంట‌ర్‌లో 963 మార్కులు సాధించారు. ఇదే స‌మ‌యంలో ఏఐఈఈఈలో ఉత్త‌మ ర్యాంకు సాధించి, వ‌రంగ‌ల్ నిట్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో అడ్మిష‌న్ పొందాడు. ఐఐటీ కూడా క్వాలిఫై అయినా.. తాను కోరుకున్న‌ట్లు బ్రాంచ్ రాక‌పోవ‌డంతో నిట్‌లో చేరాడు. వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్‌(ఈసీఈ) 2012లో పూర్తి చేసి, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లోనే ప్ర‌ముఖ కేంద్ర‌ ప్ర‌భుత్వ సంస్థ సీడాట్‌లో రీసెర్చ్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. ఇక్క‌డే స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తించి అంచెలంచెలుగా ఎదిగారు. ప్ర‌స్తుతం శాస్త్ర‌వేత్త -డి హోదాను పొంది బెంగుళూరులోని సీడాట్ కార్యాల‌యంలో 4జీ, 5జీ టెక్నాల‌జీ, మిగ‌తా సాంకేతిక ప్రాజెక్టుల‌ అభివృద్ధిపై ప‌నిచేస్తున్నారు.

ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్ ఏర్పాటు
నాన్న మాట‌ల స్ఫూర్తి, గురువు ప్రోత్సాహంతో ఎదిగిన మోహ‌న్‌.. తాను కూడా క‌ష్టాల్లో ఉన్న పేద విద్యార్థుల‌కు విద్య‌, ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌లో తోడు ఉండాల‌న్న సంక‌ల్పంతో బీటెక్ రెండో సంవ‌త్స‌రంలోనే నేష‌న్స్ ఫ‌స్ట్ హ్యూమ‌న్ చైన్ ఫౌండేష‌న్ ఏర్పాటు చేశాడు. ఇలా విద్యార్థి ద‌శ‌లోనే సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. ఈ సంస్థ ఆధ్వ‌ర్యంలో గ్రామీణ పేద పిల్ల‌ల‌కు విద్య‌, ఉద్యోగ క‌ల్ప‌న కోసం సాయం అందించడం, ఆరోగ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.. ఈ సంస్థ ప్ర‌ధాన ల‌క్ష్యాలు. సంస్థ వ్య‌వ‌స్థాప‌కులుగా ఉన్న మోహ‌న్‌.. త‌న టీమ్‌తో క‌లిసి అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. టీమ్‌లో ప్ర‌ధానంగా సివిల్ స‌ర్వెంట్స్‌, ఎన్ఐటీ, ఐఐటీ త‌దిత‌ర ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల నుంచి ఎదిగిన వారు, వైద్యులు, వివిధ ప్ర‌భుత్వ, ప్రైవేట్‌ రంగాల నిపుణుల‌తో నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్‌ టీమ్ ఏర్పాటు చేసి, కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. నిరంత‌రం నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్ టీమ్ స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ అనేక‌మంది స్నేహితుల స‌హ‌కారంతో పేద‌ల‌కు విద్య‌, ఉద్యోగ అవ‌కాశాలపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ అవ‌స‌ర‌మైన సాయం అందిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img