– మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు ఎన్‌కౌంటర్
– కేంద్ర మిలిటరీ ఇన్చార్జిగా బాధ్యతలు
– విప్లవోద్యమంలో అంచలంచెలుగా ఎదిగిన నేత
– టేకులగూడెంలో పాలేరుగా పనిచేసిన ఏసోబు
– వందలాది కుటుంబాలకు భూములు పంచిన నాయకుడు
– కన్నీటిసంద్రంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు
అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి : టేకులగూడెం పోరుదారిలో మరో వీరుడు నేలకొరిగాడు.. దొరతనంపై రణ నినాదమై ఎగిసిన పాలేరు ఏసోబు.. మనిషిని మనిషిగా ప్రేమించే మానవ సమాజాన్ని కలగన్నాడు.. నాలుగు దశాబ్దాలపాటు మావోయిస్టు విప్లవోద్యమంలో అలుపెరుగని ప్రయాణం సాగించి అమరత్వం పొందాడు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఏసోబు… దొరల వద్ద పాలేరుగా పనిచేశాడు. రాతిమోట కొట్టాడు. బావులు తవ్వాడు.. బ్యాండ్ మేళం మేస్త్రీగా పనిచేశాడు. చదువుకున్నది ఏడో తరగతే అయినా.. అసమానతలు పోవాలని, ప్రజలంతా ఒక్కటిగా బతకాలంటూ.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ సాగాడు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అలియాస్ జగన్‌గా, దాదా రణదేవ్‌గా అనేక బాధ్యతలు చేపట్టారు. కేంద్ర కమిటీలో కీలక నేతగా ఎదిగిన మాచర్ల ఏసోబు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ చత్తీస్‌గడ్ రాష్ట్రం దంతెవాడలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కేంద్ర మిలిటరీ ఇన్చార్జిగా, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ బార్డర్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. రణదేవ్‌కు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు సంతానం. రణదేవ్ మరణవార్త విన్న టేకులగూడెం తల్లడిల్లింది. కుటుంబ సభ్యులు, బంధువులు, చిన్ననాటి స్నేహితులు, స్థానికులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, చత్తీస్‌గడ్ నుంచి టేకులగూడెంకు ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
నిరుపేద దళిత కుటుంబం…
నిరుపేద దళిత కుటుంబంలో ఏసోబు జన్మించాడు. తల్లిదండ్రులు గ్రామంలోనే వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. తామంతా ఐదో తరగతిలోనే బడి మానేస్తే.. ఏసోబు మాత్రం ధైర్యంగా ధర్మసాగర్‌కు వెళ్లి ఏడో తరగతి వరకు చదువుకున్నాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఉన్నత వర్గాల పిల్లలకన్నా.. ఆయన చదువులో ముందుండేవాడని, ఆయన చేతి రాత అందంగా ఉండేదని, ఆయనతో ఎవరూ పోటీపడేవారు కాదని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. చదువులో చురుగ్గా ఉండే ఏసోబు భూస్వాములు, దొరల అరాచకాలను ప్రశ్నించేవాడని, మనుషులందరూ ఒక్కటేనని, పేదరికం పోవాలని, అందరూ సమాన హక్కులతో బతకాలని పదేపదే చెప్పేవాడనిస్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
దొరల వద్ద పాలేరుగా….
టేకులగూడెం గ్రామంలో ఏసోబు పాలేరుగానూ పనిచేశాడు. గ్రామానికి చెందిన దొరల వద్ద సుమారు దశాబ్దకాలంపాటు జీతగాడిగా పనిచేశారు. రాతిమోట కొట్టాడు. ఆయిల్ ఇంజిన్ నడిపంచాడు.. అంతేగాకుండా, వ్యవసాయ బావులు తవ్వే పనులకూ వెళ్లాడు. బ్యాండ్‌మేళం మేస్త్రీగానూ ఆయన కొంతకాలం పనిచేశాడు. పాలేరుగా పనిచేసినా, బావులు తవ్వేందుకు వెళ్లినా.. బ్యాండ్‌మేళానికి వెళ్లినా.. తోటివారితో ఎంతో కలివిడిగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం సద్ది తినేటప్పుడు అందరూ తిన్నతర్వాతే ఏసోబు తినేవాడని, ముందుగా మీరు తినండి.. నేను తర్వాత తింటాను.. అంటూ ఎదుటివారి ఆకలితీర్చేవాడని, ఎవరికి ఆపద వచ్చినా.. ముందువరుసలో ఉండేవాడని, అలాంటి మంచి మనిషిని తాము కోల్పోయామని తోటిమిత్రులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.
విప్లవోద్యమం వైపు అడుగులు
టేకులగూడెంలో ఉన్న దొరలు, భూస్వాముల అరాచకాలపై గ్రామానికి చెందిన అనేక మంది విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఇదే క్రమంలో సుమారు 1985 నుంచి విప్లవోద్యమం వైపు అడుగులు వేసిన ఏసోబు.. మళ్లీ వెనకడుగు వేయలేదు. గ్రామస్తులను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ.. సమస్యలపై నిరంతరం పోరాటం చేశాడు. పేదళ్లకు భూములు పంచాడు. రైతుకూలి ఉద్యమాన్ని ముందుండి నడిపంచారు. అప్పటి పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ అజ్ఞాతంలోకి వెళ్లిన ఏసోబు మొదట్లో అన్నసాగర్ దళకమాండర్‌గా, స్టేషన్‌ఘన్‌పూర్, చేర్యాల కమాండర్‌గానూ పనిచేశారు. ఇలా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొంది అంచెలంచెలుగా ఏసోబు కేంద్ర కమిటీ కీలక నేతగా ఎదిగారు. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని, విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం కొనసాగిన ఏసోబు.. దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసోబు స్ఫూర్తితో ఎంతోమంది విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు.
తుపాకులగూడెంగా గుర్తింపు..
విప్లవోద్యమ నిలయంగా టేకులగూడానికి గుర్తింపు ఉంది. భూస్వాములు, దొరల అరాచకాలపై ప్రజలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఒకానొక దశలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కూడా బహిష్కరించిన చరిత్ర ఆ గ్రామానికి ఉంది. ఏసోబు కన్నా ముందుతరం నాయకులు ప్రజా ఉద్యమాలు నడిపించారు. ఈ క్రమంలో ఎంతోమంది విప్లవోద్యమంలో అసువులుబాసారు. పోలపల్లి విజయ భాస్కర్ (అలియాస్ సుకుదేవ్, కుంజూమ్, నర్కటోల్), బండి ఆశాలు, బండి చంద్ర మౌళి, మాచర్ల ఏసోబు( అలియాస్ జగన్, దాదా రణదేవ్) ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది నిర్బంధాలను ఎదుర్కొన్నారని, ప్రభుత్వాలు, పోలీసుల వేధింపులకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆపరేషన్ క్రాక్‌డౌన్ కు వ్యతిరేకంగా గ్రామస్తులంతా ఏకమై సాయుధబలగాలను తరిమికొట్టిన గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే టేకులగూడెం అంటే.. తుపాకులగూడెంగా పిలుస్తుంటారు.