అక్షరశక్తి, హనుమకొండ: యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న ఇంటర్వ్యూలకు హనుమకొండ జిల్లా కాజీపేట సిద్ధార్థ నగర్ కు చెందిన తక్కలపల్లి సాగరిక హాజరయ్యారు. ఈ మేరకు గత మూడు రోజుల క్రితం ఏఐసీసీ నుండి ఆమెకు ఆహ్వానం అందిన నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న సాగరిక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ సీనియర్ల సమక్షంలో నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్ష పదవి కోసం నిర్వహించే ఇంటర్వ్యూ కు తెలంగాణ రాష్ట్రం నుండి సాగరిక ఒక్కరికే ఆహ్వానం అందడం గమనార్హం. దక్షిణ భారతదేశం నుండి ఏకైక మహిళా కావడం మరోవైపు యువజన కాంగ్రెస్ జాతీయస్థాయి పదవుల కేటాయింపుల్లో కూడా 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్ నేతల్లో ఈ ఇంటర్వ్యూలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2009 సంవత్సరంలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కిట్స్ కళాశాల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సాగరిక 2013లో ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీగా 2014లో జాతీయ ప్రతినిధిగా 2017-18 ఎన్ఎస్యుఐ కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతల్లో కొనసాగుతూనే 2018లో జాతీయ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసిన ఆమె 2018 సంవత్సరంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. అనంతరం 2021లో రాష్ట్రస్థాయిలో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మరోమారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆమె ప్రతిభను గుర్తించి ఏఐసిసి జాతీయ కో ఆర్డినేటర్ గా నియమిస్తూ 2021 లో జరిగిన గోవా ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. అనంతరం వరుసగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా కొనసాగిస్తూ జాతీయ యువజన కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు పలుబాధ్యతలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన విభాగాలైన ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ లలో అంకితభావంతో పని చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాగరికకే యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని రాష్ట్రస్థాయిలో జోరుగా చర్చ జరుగుతుంది.