Monday, June 17, 2024

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

Must Read
  • కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం
  • తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు
  • సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు
  • ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు
  • ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం
  • కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం
  • టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు

ఒక ఉద్య‌మ క‌బ్జాకోరు నుంచి.. ఒక నియంత నుంచి.. భూస్వామ్య‌, మ‌తోన్మాద భావ‌జాలం క‌ల‌గ‌ల‌సిన‌ ఒక అప్ర‌జాస్వామిక‌ పాల‌కుడి నుంచి ఈరోజు తెలంగాణ ఊపిరిపీల్చుకుంది. ప‌దేళ్లుగా తీవ్ర అణ‌చివేత‌కు గురైన‌ స్వేచ్ఛా గొంతుక‌ను తిరిగి పొందింది. తెలంగాణ అంటేనే పోరుగీతిక‌.. తెలంగాణ అంటేనే త్యాగాల నిల‌యం.. అంత‌టి ఆత్మాభిమాన నేల‌న‌.. ఒక నియంత పాల‌న‌ను ప్ర‌జ‌లు భ‌రిస్తారా..? రాచ‌రిక పోక‌డ‌ను స‌హిస్తారా..? అది జ‌ర‌గ‌ని ప‌ని.. అందుకే ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ద‌గాకోరు పాల‌నను ప్ర‌జ‌లు విసిరికొట్టారు. కేసీఆర్ దుబారా పాల‌న‌ను మ‌ట్టిక‌రిపించారు. మంచి మాటున తెలంగాణ‌ను నిండాముంచిన కేసీఆర్‌ను.. తిరిగి ఇంటికి పంపించారు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ని మ‌రోసారి నిరూపించారు.. ఇప్పుడు ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌చ్చితంగా ప్ర‌జాస్వామిక పాల‌న‌ను అందిస్తుంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే.. ప‌దేళ్లూ క‌నీసం గోడ‌ను కూడా తాక‌డానికి అవ‌కాశంలేని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను.. ప్ర‌జాభ‌వ‌న్‌గా మార్చారు సీఎం రేవంత్‌రెడ్డి.. ముందుముందు మ‌రెన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌బోతున్నారు.. అని అంటున్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, ములుగు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో అత్యంత కీల‌క పాత్ర పోషించిన గాజ‌ర్ల అశోక్‌తో ప్రత్యేక ప్రతినిధి మాట్లాడారు. ఈసంద‌ర్భంగా అనేక అంశాల‌ను పంచుకున్నారు. ఈ ప‌దేళ్ల‌లో తెలంగాణ‌కేమో అప్పులు మిగ‌ల‌గా.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం అపార‌మైన ఆస్తులు పెరిగాయని అన్నారు.

ప్ర‌శ్న : గాజ‌ర్ల కుటుంబం అంటేనే విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌.. మీ నేప‌థ్యం చెప్పండి?
అశోక్ : గాజ‌ర్ల కుటుంబం అంట‌నే విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర అని మీరు అంటున్నారు.. అది స‌రికాదు.. ఎందుకంటే.. తెలంగాణ‌లో ప‌ల్లెప‌ల్లెనా.. ప్ర‌తీ కుటుంబంలో క‌నీసం ఒక్క‌రైనా విప్ల‌వ‌కారుడు ఉంటారు. భూస్వామ్య వ్య‌వ‌స్థ‌ను, ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌ను, దొరత‌నాన్ని కూల‌దోయ‌డానికి.. స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం ఎంద‌రో త‌ల్లులు త‌మ‌ బిడ్డ‌ల‌ను అడ‌విలోకి పంపించారు. వంద‌లు, వేలాదిమంది త‌మ ప్రాణాలను తృణ‌ప్రాయంగా ప్ర‌జ‌ల కోసం అర్పించారు. అందులో మాదొక కుటుంబం. మా కుటుంబంలో మొదటగా గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, భాస్కరన్న 1990లోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి విప్లవోద్యమంలో చిట్యాల దళ కమాండర్, జిల్లా కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, పార్టీలో మొదటి ప్లాటూన్ కమాండర్‌గా, రాష్ట్ర, కేంద్ర కమిటీల స్థాయిలో పనిచేస్తూ ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. అలాగే మరో సోదరుడు గాజర్ల రవి, అలియాస్ గణేష్, ఉదయ్ పేరుతో చర్చల ప్రతినిధిగా వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న కేంద్ర క‌మిటీలో కొన‌సాగుతున్నారు. నేను కూడా వారి అడుగుజాడ‌ల్లోనే న‌డిచాను. గాజర్ల అశోక్‌గా ఉద్య‌మంలోకి వెళ్లిన నేను ఐతుగా దండకారణ్యంలో రాష్ట్ర నేతగా పనిచేశాను. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ప‌నిచేశాను. సుమారు మూడు ద‌శాబ్దాల‌పాటు విప్ల‌వోద్య‌మంలో ఉన్నా. అయితే.. అనారోగ్య కార‌ణాల‌తో 2016లో జనజీవన స్రవంతిలో కలిశాను.

ప్ర‌శ్న : ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరారు ?
అశోక్ : నేను విప్ల‌వోద్య‌మంలో మూడు ద‌శాబ్దాల‌పాటు ఉన్నాను. నా జీవిత‌మంతా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే సాగింది. అయితే.. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో ప్ర‌త్యేక తెలంగాణ అనేది ఎన్నో ద‌శాబ్దాల క‌ల‌. విప్ల‌వ పార్టీగా పీపుల్స్‌వార్ కూడా తెలంగాణ‌ను బ‌లంగా కోరుకుంది. ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపించింది. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర్చింది. ఎంద‌రో విద్యార్థి అమ‌రుల త్యాగాల పునాదుల‌పై తెలంగాణ ఏర్ప‌డింది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గౌర‌వించి, ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్టాలు కేవ‌లం ప్ర‌త్యేక రాష్ట్రంతోనే తీరుతాయ‌ని న‌మ్మిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఏపీలో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా సాహ‌స నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి.. కేవ‌లం రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. త‌న గార‌డీ మాట‌ల‌తో ప్ర‌జా ఉద్య‌మాన్ని త‌న చేతుల్లోకి తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే.. చాలా తెలివిగా తెలంగాణ ఉద్య‌మాన్ని క‌బ్జా చేశాడు. అందుకే.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌పై, ప్ర‌జాస్వామిక విలువ‌ల‌పై గౌర‌వంలేదు. ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామికవాదులు, ప్ర‌జాసంఘాలు.. ఇలా స‌క‌ల జ‌నుల పోరాట‌ఫ‌లితంగా తెలంగాణ వ‌చ్చింది. కానీ.. స్వ‌రాష్ట్రంలో వీళ్లంద‌రికీ విలువ‌లేకుండా పోయింది. కేవ‌లం.. కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీశ్‌రావుకు తెలంగాణ సొంత‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇదంతా చూసిన నేను.. ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్నాను. ఈ దేశంలో మోడీ పాల‌న‌లో సాగుతున్న విధ్వంస‌కాండ‌ను ప్ర‌జ‌లకు వివ‌రించేందుకు భార‌త్ జోడో యాత్ర‌తో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు ప్ర‌జాస్వామిక అడుగులు వేసిన రాహుల్‌గాంధీతో క‌లిసి న‌డ‌వాల‌ని అనుకున్నాను. ప్ర‌జాస్వామిక‌ తెలంగాణ కోసం పోరాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో క‌లిసి ప‌నిచేయాలని అనుకున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపు కోసం నావంతు కృషి చేశా.

ప్ర‌శ్న : కేసీఆర్‌ది అప్ర‌జాస్వామిక పాల‌న అన్నారు.. ఎందుకు?
అశోక్ : ముమ్మాటికీ కేసీఆర్‌ది అప్ర‌జాస్వామిక పాల‌నే.. నియంత పాల‌నే.. ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేశాడు. ప్ర‌జ‌లు, ప్ర‌జాసంఘాలు, ఉద్యోగులు, కార్మికులు.. త‌మ క‌ష్టాల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా చేశాడు. ఎవ‌రైనా రోడ్డు ఎక్కితే అరెస్టులు చేయించారు. ప్ర‌జా గొంతుక‌ల‌కు చోటు లేదు. మేధావుల‌కు విలువ‌లేదు. క‌ళాకారుల‌కు స్థానం లేదు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కూ ప్ర‌జ‌ల్లో విలువ‌లేకుండా చేశాడు. కేవ‌లం వారిని సంత‌కాల‌కే ప‌రిమితం చేశాడు. ప‌థ‌కాల అమ‌లులో శాస్త్రీయ‌త లేదు. 80వేల పుస్త‌కాలు చ‌దివిన మేధావికి.. తెలంగాణ‌లో కౌలు రైతుల‌ను గుర్తించ‌లేరా..? వారికి నేరుగా రైతుబంధు అందేలా చూడ‌లేరా..? ఒక్క ప‌రీక్ష‌ను కూడా కోర్టుకు వెళ్ల‌కుండా.. లీకులు లేకుండా నిర్వ‌హించ‌లేరా..? అంతెందుకు.. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో మ‌ళ్లీ భూస్వాముల చేతుల్లోకి పేద‌ల భూములు వెళ్లేలా చేసిన దుర్మార్గ‌మైన పాల‌న కేసీఆర్‌ది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో చుక్క నీరు రాలేదుగానీ.. ల‌క్ష‌కోట్లు నీళ్ల‌పాలు చేశాడు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి తెలంగాణ కోస‌మా.. వంద‌లాదిమంది ప్రాణాలు అర్పించింది.. ఇలాంటి తెలంగాణ కోసమా.. సోనియా గాంధీ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇక్క‌డ మ‌రొక విష‌యం చెప్పాలి.. ఈ ప‌దేళ్ల‌లో తెలంగాణ‌లో జ‌రిగినంత ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌లేద‌ని మేధావులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా త్యాగ‌పూరిత‌మైన ఈ నేల స్వ‌భావాన్నే ధ్వంసం చేశాడు. ప్ర‌జా గొంతుక‌లు లేకుండా.. కేవ‌లం ఒక లంపెన్ సెక్ష‌న్‌ను త‌యారు చేశాడు. మ‌రి ఇలాంటి పాల‌కుడు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ఇంటికి పంపించారు. అందులో నావంతు పాత్ర నేను పోషించా.

ప్ర‌శ్న : ఆరు గ్యారంటీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుందా..?
అశోక్ : ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌జాస్వామిక పాల‌న వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు నాయ‌క‌త్వంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. ఎన్నిక‌ల ముంగిట ఇచ్చిన హామీ ఆరు గ్యారంటీల అమ‌లు వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. మిగులు బ‌డ్జెట్‌తో ఉన్న తెలంగాణ‌ను అప్పుల‌కుప్ప‌గా మార్చారు. దానిని అధిగ‌మించ‌డానికి ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి.. కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టారు. ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ నియంత‌ ప‌దేళ్ల పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ఎంత‌టి ఇబ్బందుల‌కు గుర‌య్యారో.. కాంగ్రెస్ పాల‌న‌లో చాలా సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డిపే వాతావ‌ర‌ణం ఇప్ప‌టికే ఏర్ప‌డింది. గ్రామగ్రామాల ప్ర‌జాపాల‌న స‌భ‌లు కొన‌సాగుతున్నాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా.. ఎక్క‌డ కూడా నాయ‌కుల ప్ర‌మేయం లేకుండా.. కేవ‌లం అధికారుల క‌నుస‌న్న‌ల్లోనే ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ చేప‌డుతున్నారు. ఇంత‌టి పార‌ద‌ర్శ‌క పాల‌న‌లో త‌ప్ప‌కుండా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ‌లోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయం. ప్ర‌జ‌లంతా కూడా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల‌ని చూస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img