Friday, May 3, 2024

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

Must Read
  • ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి..
  • ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు
  • వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు
  • ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ – వరంగల్‌ – ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రాకేశ్‌రెడ్డి పేరును ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ప‌నిచేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు కూడా అందిన‌ట్లు తెలుస్తోంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి జ‌న‌గామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ‌డంతో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన నల్లగొండ – వరంగల్‌ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కోసం కసరత్తు జ‌రుగుతోంది. దీంతో ఈ స్థానం నుంచి యువ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని పోటీకి దింపాల‌ని బీఆర్ఎస్‌ హైక‌మాండ్ నిర్ణ‌యించిన‌ట్లు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా ప‌నిచేసిన రాకేశ్‌రెడ్డి పార్టీలో చురుకైన నేత‌గా గుర్తింపు ద‌క్కించుకున్నారు. అన‌తికాలంలోనే రాష్ట్ర‌స్థాయి నాయ‌కుడిగా ఎదిగారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న అనంత‌రం ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈక్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నల్లగొండ – వరంగల్‌ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి రాకేశ్‌రెడ్డిని పోటీకి దిపంనున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

జిల్లాల్లో ప్ర‌చారం..

వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీకి దిగ‌నున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆయా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ప్ర‌చారం ప్రారంభించారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను క‌లుస్తూ ఓట‌రు న‌మోదుపై ప్ర‌త్యేకంగా అవగాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. మ‌రోప‌క్క గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో తీవ్ర నిరాశ‌లో ఉన్న బీఆర్ఎస్‌ నాయ‌కులంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మంక‌గా భావిస్తున్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ఫిబ్రవరి 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 4 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతోపాటు జూన్‌ 8 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు కీలకం కావడంతో ఆయా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img