Sunday, May 19, 2024

బీజేపీలోకి అభిన‌వ్ భాస్క‌ర్‌?

Must Read
  • గౌర‌వంలేనిచోట ఉండ‌లేనంటూ ఆవేద‌న‌
  • రేపే పార్టీ పెద్ద‌ల స‌మక్షంలో చేరే అవ‌కాశం!
  • వ‌రంగ‌ల్ ప‌శ్చిమలో బీఆర్ఎస్‌కు భారీ షాక్‌

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. పార్టీని వీడిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీ ప‌రిస్థితి కొంత గంద‌ర‌గోళంలో ప‌డిపోతోంది. మొన్న‌టికి మొన్న తెలంగాణ రాష్ట్ర మొట్ట‌మొద‌టి ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈనెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తాజాగా, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీఆర్ఎస్‌లో భారీ కుదుపు మొద‌లైంది. ఆ పార్టీకి చెందిన గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 60వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌, మాజీ మంత్రి, దివంగ‌త ప్ర‌ణ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు అభిన‌వ్ భాస్క‌ర్ కూడా బీఆర్ఎస్‌ను వీడ‌డం ఖాయ‌మైపోయింది. సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రణయ్ అన్న ఆత్మీయల సమావేశంలో అభినవ్ భాస్కర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం త‌మ‌ కుటుంబం చాలా త్యాగాలు చేసిందని, అయినా బాబాయ్ దగ్గర తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

1998లో తన తండ్రి ప్రణయ్ భాస్కర్ మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరిందని, అయితే అమ్మ త్యాగం చేసి, వినయ్ భాస్కర్‌కు అవకాశమవ్వాలని కోరిందన్నారు. 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని ఆ పార్టీ పెద్దలు చెప్పినా వినలేదని, తమ కుటుంబంలో కలహాలు వస్తాయని భావించి బాబాయ్ కోసం పూర్తిస్థాయిలో పని చేశానని గుర్తు చేశారు. తన చుట్టూ ఉండే నలుగురైదుగురు వ్యక్తుల మాటలు నమ్మిన బాబయ్.. తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం నన్ను కలిసి వేసిందన్నారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేనని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా, అభిన‌వ్ భాస్క‌ర్ బీజేపీలోకి వెళ్ల‌నున్న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న పార్టీ పెద్ద‌ల సమ‌క్షంలో క‌మ‌లం గూటికి చేరనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కూడా ఆయ‌న బీఆర్ఎస్ వీడుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img