- నియోజకవర్గవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
- మాకోసం ఏంచేశాంటూ సూటిగా ప్రశ్నలు
- కనీసం మౌలిక సదుపాయాలైన
కల్పించావా అంటూ ఆగ్రహావేశాలు - మొన్న చిట్యాల, టేకుమట్ల,
నేడు గణపురం మండలాల్లో నిరసన సెగలు - భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి: గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మాకోసం ఐదేళ్లలో ఏం చేశావ్..? మా గ్రామానికి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించావా.. ? ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరికి వచ్చావా.. ? ఎన్నికలు రాగానే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నావ్.. ? మీ సంపాదన పెంచుకోవడానికి తప్ప మాకోసం నువ్వు చేసింది ఏంటి..? భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుం చి ఎదురవుతున్న నిరసన సెగలు ఇవి. నాలుగు రోజుల కింద చిట్యాల, టేకుమట్ల మండలాల్లో ఎమ్మెల్యే గండ్ర ప్రచారాన్ని అడ్డుకొని నిలదీసిన ప్రజలు నిన్న గణపురం మండలంలోనూ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రచారాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. మూడు మండలాలే కాదు మిగతా అన్ని మండలాల్లోనూ ఇదే తంతు కొనసాగుతూ ఉంది. గండ్ర ప్రచారంలో నిలదీతలు.. నిరసనలు నిత్యకృత్యం అవుతున్నాయి. దీంతో సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యే గ్రామాలకు భారీ పోలీసు బలగాలతో వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలిచాక బందోబస్తుతో గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేను చూసాంగానీ, ప్రచారానికీ పోలీసు బందోబస్తుతో వచ్చే నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం అని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటుండం గమనార్హం.
ఊరూరా నిరసన సెగలు..
చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని కాల్వపల్లి, గిద్దెముత్తారం, వెలిశాల గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రచారాన్ని ఇటీవల గ్రామస్తులు అడ్డుకున్నారు. చిట్యాల మండలం గిద్ద ముత్తారం శివారు తండాలో గ్రామస్తులు ఎమ్మెల్యే గండ్రను నిలదీశారు. పదవిలో ఉన్న ఐదేళ్లలో మా తండా ఒక్కసారైనా గుర్తుకు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒక్కరోజైనా తండవాసులను కలిసి మా సమస్యలు అడిగారా..? ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ నిలదీశారు. డ్రైనేజీలు లేక వర్షపు నీరు ఇళ్లల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డామని, అయినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహలక్ష్మి ఇల్లు లేవు.. తండాకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. మీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని సూటిగా ప్రశ్నించారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖంగుతిన్నారు. మీకు ఓటు వేసేది లేదని ఖరాకండిగా తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
గణపురం మండలంలో..
ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా గ్రామానికి మీరు ఏం చేశారో చెప్పండి అని గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామస్తులు గురువారంరాత్రి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని నిలదీశారు. ఐదేళ్లుగా పట్టించుకోని మీరు మళ్లీ మా గ్రామానికి ఈ ఎన్నికల సమయంలో ఎందుకు వచ్చారని నిరసన వ్యక్తం చేశా రు. గ్రామానికి ఏం చేశారో చెప్పి రావాలని నిలదీశారు. మీకున్న ఆస్తులను పెంచుకోవడం తప్ప మాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం లో ఓ మహిళ ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చిన సమయంలోనే తన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరుపేదను అయినప్పటికీ తనకు గృహలక్ష్మి కింద ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన స్థానిక నాయకులు ఆమెని పక్కకు తీసుకెళ్లి సముదాయించడంతో ప్రచారం ముగించి వెనుతిరిగారు.
ఓట్లు మావి.. పథకాలు మీవాళ్లకేనా..?
దళితబంధు, మిషన్ భగీరథ, గృహలక్ష్మి తదితర పథకాలపై సీఎం కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, మంత్రులు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దళితబంధు, గృహ లక్ష్మి కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నదనే ప్రజలు మండిపడుతున్నారు. దీంతో నియోజకవర్గవ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సంక్షేమ పథకాలు తమకు అందివ్వకుండా పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటూ ఓట్ల సమయంలో మాత్రం మా దగ్గరికి వస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలే రక్షిస్తాయని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు అవే ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా దళితబంధు విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒక్కో యూనిట్‌ను నలుగురు పంచుకోవాలని స్థానిక నాయ కులు చెప్పడం వారిలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈక్రమంలోనే ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ నాయకులకు ప్రజలనుంచి చేదు అనుభవం ఎదురవుతోంది.
భారీ పోలీసు బందోబస్తు…
నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకుం టుండటంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తుతో వెళ్తున్నారు. నిరసనలు జరిగితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం లేదా సముదాయించడం చేసేలా ముందుకు పోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తం గా నెగిటివ్ ప్రచారం వెళ్లే అవకాశం ఉండడంతో జాగ్రత్త పడుతున్నారు. ఊరూరా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఎమ్మెల్యే గండ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీరా ఎన్నికల ముంగిట చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.