- బీజేపీ టికెట్ రేసులో భంగపాటు
- స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి..
- కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు
- 15ఏళ్లుగా పార్టీలో చురుకైన పాత్ర
- తెలంగాణ ఉద్యమంలోనూ కీలక భూమిక
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పలుచోట్ల పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన నాయకులకు టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే పరిస్థితి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ రాష్ట్రనాయకుడు బొల్లినేని రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎంతోకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికికాకుండా.. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాజేష్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నం చేయని పక్షంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బొల్లినేని రాజేష్ విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన రాజేష్.. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే 2007 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. గతంలో బీజేవైఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. స్టేట్ మీడియా కో కన్వీనర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లా జేఏసీలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ముందుకు నడిచారు.
టికెట్ రేసులో ఉన్నా…
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ను బొల్లినేని రాజేష్ ఆశించారు. కానీ, అనూహ్యంగా బీజేపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో సుమారు 15ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న రాజేష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలేసి.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై పార్టీవర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బొల్లినేని రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలు స్పందించి, బుజ్జగించాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.