- బీజేపీలోకి ఆత్మకూరు ఎంపీటీసీ, వార్డు సభ్యులు
- ఈటల రాజేందర్ సమక్షంలో చేరిక
- చక్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి
అక్షరశక్తి, పరకాల : పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవరు.. ఎప్పుడు..ఎక్కడ.. ఎలా షాక్ ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా, ఆత్మకూరు మండల ఎంపీటీసీ బయ్య రమ, ఆత్మకూరు వార్డు సభ్యులు బయ్య రాజు, బీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు బయ్య అఖిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కమలాపురంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. వారికి బీజేపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియంత పోకడలను వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి ప్రకటించడంతో ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఆత్మకూరు మండలంలోని ముఖ్య నాయకులు అందరూ త్వరలో బిజెపి పార్టీలో చేరుతున్నట్లు ఎంపీటీసీ తెలిపారు. రాబోయే ఎన్నికలలో పరకాల నియోజకవర్గం లో భారీ మెజార్టీతో బీజేపీని గెలిపిస్తామని అన్నారు.