Monday, June 17, 2024

ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌!

Must Read
  • రూ.వెయ్యి కోట్ల‌తో కార్పొరేష‌న్ సాధ‌నే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌
  • జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌
  • తెలంగాణ ఉద్య‌మంలో ఆటో డ్రైవ‌ర్ల కీల‌క పాత్ర‌
  • రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6ల‌క్ష‌ల మంది..
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 50వేల మంది..
  • రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు బాగుప‌డుతాయ‌ని ఆటో డ్రైవ‌ర్లు ఎన్నో క‌ల‌లు క‌న్నారు. బ‌తుకు భ‌ద్ర‌త దొరుకుతుంద‌ని ఆశ‌ప‌డ్డారు. రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. సుమారు 22 మంది ప్రాణ త్యాగాలు చేశారు. చివ‌ర‌కు రాష్ట్రం వ‌చ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా.. వారు క‌ల‌గ‌న్న ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు కాలేదు. ఈ నేప‌థ్యంలో ఆటో డ్రైవ‌ర్లు మ‌ళ్లీ పోరుబాట ప‌డుతున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో త‌మకు ఇచ్చిన హామీల అమ‌లు కోసం, వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్ సాధ‌న కోసం ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వ‌స్తున్నారు. ద‌శ‌ల‌వారీగా ఆందోళ‌న కార్యాక్ర‌మాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ముందు అనేక డిమాండ్లు ఉంచుతున్నారు. ఇందులో భాగంగా జూలై 5వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వ‌ర‌కు సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టనున్న‌ట్లు తెలంగాణ ఆటో డ్రైవ‌ర్స్ యూనియ‌న్ నేత గుడిమ‌ల్ల ర‌వికుమార్ ప్ర‌క‌టించారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇచ్చి, ఆటో డ్రైవ‌ర్ల‌కు అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు.

20ఏళ్లుగా ఉద్య‌మం…
అనేక ఏళ్లుగా ప్ర‌భుత్వాలు ఉద్యోగ క‌ల్ప‌న‌లో విఫ‌లం చెందుతున్నాయి. దీంతో డిగ్రీలు, పీజీలు త‌దిత‌ర ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఖాలీగా ఉండేవాళ్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో అనేక మంది స్వ‌యం ఉపాధి కోసం, కుటుంబ పోష‌ణ కోసం ప్ర‌యాణికుల ఆటోలు న‌డుపుకుంటూ బ‌తుకులు వెల్ల‌దీస్తున్నారు. చేతిలో ప‌నిలేక‌ దిక్కు తెలియ‌ని, దారితోచ‌ని స్థితిలో ఆటో డ్రైవ‌ర్ వృత్తిని ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చూస్తుండ‌గానే ఏళ్లు గ‌డిచిపోయి.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ హ‌క్కుల కోసం.. సుమారు 20ఏళ్లుగా ఆటో డ్రైవ‌ర్లు ఉద్య‌మం చేస్తున్నారు. త‌మ‌ను ప్ర‌భుత్వం గుర్తించాల‌ని, ప్ర‌త్యేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అమ‌లు చేయాల‌ని, ప్ర‌ధానంగా వెయ్యి కోట్ల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ‌స్తే.. త‌మ‌కు మంచి రోజ‌లు వ‌స్తాయంటూ.. ఉద్య‌మంలో అత్యంత కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చి ఏకంగా ఎనిమిది ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదంటూ ఆటో డ్రైవ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌
రూ.వెయ్యి కోట్లతో ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్‌తో తెలంగాణ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ ఆటో డ్రైవ‌ర్ల యూనియ‌న్ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది. ఇందులో భాగంగా, జూలై 5వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో సంత‌కాల సేక‌ర‌ణ‌తో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌న్న వ్యూహంతో తాడు నేత గుడిమ‌ల్ల ర‌వికుమార్ నాయ‌క‌త్వంలో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉండ‌గా, పెరిగిన పెట్రోల్‌, డీజిల్, నిత్యావ‌స‌ర‌ ధ‌ర‌ల‌తో త‌మ బ‌తుకులు భార‌మై పోతున్నాయ‌ని ఆటో డ్రైవ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేగాకుండా, పెనాల్టీల రూపంలో ట్రాఫిక్‌, పోలీసుల నుంచి కూడా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం వెయ్యి కోట్ల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేసేవ‌ర‌కు ఉద్య‌మిస్తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img