అక్షరశక్తి వరంగల్: తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) కాశిబుగ్గ ఏరియా పార్టీ జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ అన్నెబోయిన ప్రేమలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. దినదిన అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరం రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత విస్తరిస్తున్న నగరం అని గత ఎన్నికలు వచ్చిన హామీ ప్రకారం వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం వరంగల్ నగర ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెట్టి కాలం గడిపిందని అలాంటి మోసపూరిత హామీలకు పాల్పడకుండా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ క్రమంలో నగరంలో నిలువ నీడ కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్న ప్రతి పేదవాడికి ఇంటి స్థలం పట్టా ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను అందించాలని కోరారు. అలాగే పేదల కాలనీలు మురికి వాడల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పర్యటనలు జరిపి ప్రభుత్వం యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని స్థానిక పోరాటాల నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎంసిపిఐ(యు) కాశిబుగ్గ ఏరియా కన్వీనర్ గా పరిమళ గోవర్ధన్ రాజు
కాశిబుగ్గ ఏరియా ఎంసిపిఐ(యు) కన్వీనర్ గా పరిమళ గోవర్ధన్ రాజును నియమిస్తున్నట్లు పార్టీ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర నాయకులు ఐతం నాగేష్, స్థానిక నాయకులు అజయ్, పద్మ, శిరీష, దేవరాజు, ప్రభాకర్, రాజేందర్, అజయ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు.