అక్షరశక్తి, హన్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంనకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ ఇంచార్జ్ సీపీ మురళీధర్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రైమ్స్ డీసీపీ మురళీధర్ పాటు పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీస్ అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా… మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా, 2012లో వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా పనిచేయడంతోపాటు 2014లో వరంగల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పనిచేసి ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొందిన అంబర్ కిషోర్ ఝా… ఇటీవల రాచకొండ జాయింట్ సీపీగా నియమితులయ్యారు.