Saturday, July 27, 2024

మార్నేని పార్టీ మారేనా..?

Must Read
  • వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు
  • అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు?
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం
  • వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు
  • తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌

అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను వీడనున్నారా..? అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డుతున్నారా..? ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడు వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌ల‌వ‌డంలో ఆంత‌ర్యం ఇదేనా..? పైకి అధికారికంగా బ్యాంకు విష‌యంలో క‌లిసిన‌ట్టు చెబుతున్నా.. ప‌లు రాజ‌కీయ అంశాల‌ను చ‌ర్చించారా..? అంటే అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం మాత్రం ఔన‌నే చెబుతోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌గా, వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోనూ స‌త్సంబంధాలు క‌లిగిన సౌమ్యుడిగా, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు న‌డుచుకునే ప్ర‌జాప్ర‌తినిధిగా గుర్తింపు పొందిన మార్నేని రవీంద‌ర్‌రావు పార్టీ మారితే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయిన ప‌లువురు నాయ‌కులు పార్టీని వీడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మార్నేని ర‌వీంద‌ర్‌రావు కూడా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితులైన వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌ల‌వ‌డం రాజ‌కీయంగా అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

  • సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం..
    మార్నేని ర‌వీంద‌ర్‌రావు స్వ‌గ్రామం ఐన‌వోలు మండ‌ల కేంద్రం. టీడీపీతోనే మార్నేని రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు. ఐన‌వోలు సింగిల్‌విండో చైర్మ‌న్‌గా, ఐన‌వోలు దేవ‌స్థానం చైర్మ‌న్‌గా, వ‌ర్ధ‌న్న‌పేట జెడ్పీటీసీగా, వ‌ర్ధ‌న్న‌పేట ఎంపీపీగానూ ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎర్ర‌బెల్లి వ‌ర‌ద‌రాజేశ్వ‌ర్‌రావుపై మార్నేని ర‌వీంద‌ర్‌రావు విజ‌యం సాధించి, టీడీపీ జెడ్పీ ఫ్లోర్ లీడ‌ర్‌గా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు 2011లో ఐన‌వోలులో కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌(బీఆర్ఎస్‌)లో చేరారు. టీఆర్ఎస్ రైతువిభాగం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడిగా అత్యంత కీల‌క పాత్ర పోషించారు. అయితే.. ఐన‌వోలు మండ‌లం నంద‌నం ఎఫ్ఎస్‌సీఎస్ చైర్మ‌న్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికై.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. కాగా, మార్నేని ర‌వీంద‌ర్‌రావు స‌తీమ‌ణి మ‌ధుమ‌తి ప్ర‌స్తుతం ఐన‌వోలు ఎంపీపీగా కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంతోపాటు ఉమ్మ‌డి జిల్లాలోనూ ఆయ‌న ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు ల‌భించింది. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు న‌డుచుకునే నేత‌గా, వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోనూ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ సౌమ్యుడిగా గుర్తింపు పొందారు.
  • తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌..
    తెలంగాణ ఉద్య‌మంలో మార్నేని ర‌వీంద‌ర్‌రావు కీల‌క పాత్ర పోషించారు. టీడీపీ జెడ్పీ ఫ్లోర్ లీడ‌ర్‌గా కొన‌సాగుతున్న మార్నేని.. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కేసీఆర్ స‌మ‌క్షంలో అప్ప‌టి టీఆర్ఎస్‌లో చేరి, ఉద్య‌మ బ‌లోపేతం కోసం కృషి చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రైతువిభాగం అధ్య‌క్షుడిగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌ర్ధ‌న్న‌పేట‌లో పార్టీ అభ్య‌ర్థి గెలుపులో అత్యంత కీల‌క భూమిక పోషించారు. అలాగే, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ బ్యాంకు అభివృద్ధిలో త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌ధానంగా బ్యాంకును ఆధునీక‌రించి, రాజ‌కీయాల‌కు అతీతంగా సేవ‌ల‌ను విస్త‌రిస్తూ మార్నేని ర‌వీంద‌ర్ రావు ముందుకు సాగుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు మార్నేని కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందులో భాగంగానే వేం న‌రేంద‌ర్‌రెడ్డిని ఆయ‌న క‌లిసిన‌ట్లు తెలిసింది. ఇదే జ‌రిగితే.. మార్నేనితోపాటు నియోజ‌క‌వ‌ర్గంలో భారీ సంఖ్య‌లో అనుచ‌రులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా బీఆర్ఎస్‌ను వీడ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్‌కు న‌ష్టం క‌లిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img