- జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు
- వరంగల్‌కు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన
- కార్యక్షేత్రంలోకి దిగుతున్నట్లు అభిమానుల మధ్య ప్రకటన
- రాజకీయ భవిష్యత్ తేల్చాలంటూ అధినేతకు అల్టిమేటం
- ఓరుగల్లు గులాబీ పార్టీలో కలకలం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడిమల్ల రవికుమార్ గర్జించారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కాల రాయడానికి ప్రయత్నించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుట్రలను ఛేదించి, తనకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన అరెస్టు ఉద్యమకారులపై, న్యాయవాదులపై, వరంగల్ ప్రజలపై జరిగిన దాడిగానే భావిస్తామని అన్నారు. అభివృద్ధిలో వరంగల్ చివరి భాగాన ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని, కార్యక్షేత్రంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందంటూ స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్‌ను తేల్చాలంటూ అధినేతకు పరోక్షంగా చెప్పేశారు. గుడిమల్ల వ్యాఖ్యలు ఓరుగల్లు గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
అనేక నియోజకవర్గాలపై గుడిమల్ల ప్రభావం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గుడిమల్ల రవికుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక కష్టనష్టాలను ఎదురొడ్డి నిలుస్తూ ముందుకు నడిచారు. ఓరుగల్లు కేంద్రంగా నడిచిన పోరులో గుడిమల్ల ముందువరుసలో ఉన్నారు. విద్యార్థులపై, ఉద్యమకారులపై కేసులు నమోదైన సమయంలో ముందుండి కోర్టుల్లో వాదించి విడిపించారు. ఎంతటి అంశంపైనైనా ఎంత సమయమైనా ధాటిగా మాట్లడగలిగే సామర్థ్యం ఉన్న నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనేగాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. వారి హక్కుల కోసం పోరాడారు. ఆటోడ్రైవర్లు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగేలా అండగా నిలిచారు. ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై గుడిమల్ల రవికుమార్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ఒక్క పదవి కూడా రాలె…
మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గుడిమల్ల రవికుమార్‌కు స్వరాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందంటూ అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఒక్క పదవి కూడా రాలేదు. అయినా.. పార్టీని వీడకుండా, అధినేతపై నమ్మకంతో టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అనుచరులు చెబుతున్నారు. అయితే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం టికెట్ గుడిమల్లకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రవికుమార్.. నీ రాజకీయ భవిష్యత్‌కు నేను భరోసా ఇస్తున్నా.. అంటూ కేసీఆర్ చెప్పారని, ఆ నమ్మకంతోనే తాను పార్టీలో కొనసాగుతున్నానని అనుచరులతో గుడిమల్ల అన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇప్పటివరకు ఆ మాట నిజం కాకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అరెస్టుతో సంచలనం
ఈ క్రమంలోనే ఇటీవల కాకతీయ న్యాయవాదుల హౌసింగ్ కో ఆపరేటివ్ సంస్థ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో గుడిమల్ల రవికుమార్ అరెస్టు కావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన అరెస్టుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అక్రమ అరెస్టు వెనుక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేయడంతో గులాబీ పార్టీలో కలకలం రేపింది. అంతేగాకుండా, సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడానికి పోలీసులపై వినయ్‌భాస్కర్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు గుడిమల్ల ఆరోపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుచరులతో, అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ఈ ఘటనపై పార్టీ అగ్రనేతలు కనీసం తనను పలకరించలేదని, ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదంటూ ఆయన తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలుస్తోంది.
గులాబీ గూటిలో కలకలం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో గుడిమల్ల రవికుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై గుడిమల్ల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రముఖ న్యాయవాదిగా, సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనను పార్టీ దూరం చేసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో తీవ్రనష్టం జరుగుతుందన్న గుసగుసలు గులాబీవర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఉద్యమానికి అండగా, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమకారుడికి అన్యాయం జరిగితే.. తీవ్ర పరిణామాలు తప్పవంటూ పలువురు నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేత కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్‌పై ప్రటటన చేయనిపక్షంలో తనదారి తాను చూసుకునే యోచనలో గుడిమల్ల ఉన్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీల ప్రయత్నాలు…
గుడిమల్ల రవికుమార్‌ను తమ పార్టీలోకి తీసుకునేందుకు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాపై మంచి పట్టున్న గుడిమల్లను చేర్చుకుంటే.. వచ్చే ఎన్నికల్లో లాభం పొందవచ్చునన్న ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నట్లు సమాచారం. అయితే.. తన రాజకీయ భవిష్యత్‌పై కేసీఆర్ స్పందించేవరకు వేచిచూసే యోచనలో గుడిమల్ల ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై అభిమానులు, అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో గుడిమల్ల కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.