- ఆదాయం కోసమే కుడా యత్నం
- అభివృద్ధి కన్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్రభుత్వ ప్రాధాన్యం
- 22వేల ఎకరాల పచ్చని పంట భూములు మాయమైతే తీవ్ర నష్టమే!
- రైతులు, కూలీలు జీవనాధారం కోల్పోతారు
- పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం
- వరంగల్ మహానగరానికి పూలింగ్ అవసరమే లేదు
- ప్రత్యామ్నాయంగా శివారు గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి
- ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించాలి
- పుల్లూరు సుధాకర్, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు
అక్షరశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: ల్యాండ్ పూలింగ్ ఉద్దేశం మంచిదే. మౌలిక వసతుల కల్పనలో మహానగరాలపై పెరిగిన తీవ్రమైన ఒత్తిడిని తగ్గించడానికి శివారులో ఉప పట్టణాలు నిర్మించేందుకు వినియోగించే ఆధునిక ప్రక్రియ ఇది. అయితే.. అవసరం లేని చోట కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టడం నగరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వరంగల్ లాంటి నగరానికి ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు. సుమారు 22వేల ఎకరాల పచ్చని పంట పొలాలను సమీకరించేందుకు కుడా( కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) పూలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు యత్నించడం తీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీస్తోంది. నిజానికి.. పూలింగ్ ప్రక్రియకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. వరంగల్ నగరం చుట్టూ గ్రామాల రూపంలో అద్భుతమైన సంపద ఉంది. మంచి పర్యావరణ సమతుల్యత ఉంది. విద్యా, వైద్యం, రోడ్లు, పారిశుధ్యం, ఇంటర్నెట్ వంటి నగర సౌకర్యాలను ఈ గ్రామాల్లో అభివృద్ధి పర్చి స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి. ఈ విలేజ్‌లే టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చెందుతాయి. నగరంపై ఒత్తిడి తగ్గి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అవసరం తప్పుతుంది. పచ్చటి పంట పొలాలతో గ్రామాలు, నగరాలు శోభిల్లుతాయి. వరంగల్ నగరానికి ఈ భావన అక్షరాలా వర్తిస్తుంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించాలి.. అని అంటున్నారు ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపకులు, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు పుల్లూరు సుధాకర్. కొద్ది రోజులుగా వరంగల్‌లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అక్షరశక్తికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : ల్యాండ్ పూలింగ్ ఉద్దేశం ఏమిటి..? దీని అవసరం ఎందుకు?
సుధాకర్ : ఆధునిక నగరాల భావనలో ల్యాండ్‌పూలింగ్ అనేది ఒక ఆధునిక ప్రక్రియ. నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక చోదకశక్తులుగా ఎదుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 600నగరాలు 60శాతం జీడీపీని ప్రభుత్వాలకు అందిస్తున్నాయి. నగరాల ప్రాధాన్యం అంతగా పెరగడంతో ఉపాధి, విద్య, వైద్యం కోసం నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. వలసలతో నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ వసతి, మంచినీటి సరఫరా, రోడ్లు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, విద్య, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతుల పరికల్పనలో నగరాలపై ఒత్తిడి అధికమైంది. ఆ ఒత్తిడిని అధిగమించడడానికి నగరాల శివారులలో భూమిని సమీకరించి, ఉప పట్టణాలు నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో భాగంగానే భూసేకరణతోపాటు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కూడా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. భూసేకరణలో ప్రజావసరాలకు తగినంత పరిహారం ఇచ్చి భూసేకరణ చేస్తారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రైతు ఇచ్చిన భూమిలో 60శాతాన్ని రైతుకు తిరిగి ప్లాట్లుగా కేటాయిస్తారు. వ్యవసాయ భూమికంటే కూడా అభివృద్ధి చేసిన నివాసిత సముదాయాలకు విలువ ఎక్కువగా ఉంటుందని, దీంతో రైతు కూడా లాభం జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశం. అయితే.. ల్యాండ్ పూలింగ్ ఏ ఉద్దేశంతో చేపడుతున్నారన్నది కీలకం. అవసరాన్ని గుర్తించి, మంచి ఉద్దేశంతో చేస్తున్నారా..? లేక ఆదాయం కోసం చేస్తున్నారా..? అన్నది చూడాలి. అందుకే ఈ ప్రక్రియ చేపట్టేముందు ల్యాండ్ పూలింగ్ అవసరమెంత అనేది ముఖ్యంగా పరిశీలించాలి. నిజంగా అవసరం ఉన్న చోట ఉప పట్టణాలు నిర్మించడానికైతే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టవచ్చు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్‌కు ఉప పట్టణాల అవసరం లేనప్పటికీ కుడా( కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) వంటి స్థానిక సంస్థల ఆదాయం కోసం ల్యాండ్ పూలింగ్ చేపడుతోంది. పచ్చటి పంట భూములను సమీకరించి, టౌన్‌షిప్‌లు నిర్మించి వాటిని అమ్ముకోవడం ద్వారా ఆదాయం సంపాదించాలని ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇది ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది.
ప్రశ్న : దేశ వ్యాప్తంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఫలితాలు సాధిస్తోందా..?
సుధాకర్ : దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ విజయాలు సాధించింది. అందుకు కారణం.. నగరాలలో మౌలిక వసతుల కల్పనపై ఒత్తిడిని తగ్గంచడానికి, నగరాల్లో పెరుగుతున్న అధిక జనాభాకు అన్ని సౌకర్యాలు క్పలించడానికి మాత్రమే నగర శివారుల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియతో టౌన్‌షిప్‌లు నిర్మించడం ప్రధాన కారణం. ఈ క్రమంలో నగరాలపై ఒత్తిడి తగ్గింది. అవసరం లేకున్నా.. ఆదాయం కోసం పచ్చటి పంట పొలాల భూసమీకరణ అనేది ఆ ప్రాంతాల్లో జరగలేదు. గుజరాత్ , ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గ్రామ సభలు నిర్వహించి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే భూ సమీకరించి, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజధాని అమరావతి నగర నిర్మాణానికి రెండు నెలల్లో రైతులను అన్నివిధాలా ఒప్పించి, 33వేల ఎకరాల భూ సమీకరణ చేయడం జరిగింది. రైతుల సమ్మతితోనే జరిగిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ విజయవంతమైంది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చట్టబద్ధం చేశారు. అయినప్పటికీ బలవంతపు భూ సమీకరణ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని గ్రహించిన ప్రభుత్వాలు రైతులను చైతన్యపర్చి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను విజయవంతం చేశాయి. వారికి సంతృప్తికరమైన పరిహారం కూడా లభించింది. తెలంగాణలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఏరియా డెవలప్‌మెంట్ స్కీం పేరుతో జీవో నంబర్ 306 విడుదల చేసింది. ఇందులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత హెచ్ఎండీఏ ఉప్పల్ బగాయత్‌లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టి, రైతుల నుంచి తీసుకున్న భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేసి అమ్మడం ద్వారా విజయవంతంగా చేపట్టింది. ఆ ప్రక్రియతో హెచ్ఎండీఏకు వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సేకరించిన భూమిలో 40శాతం అభివృద్ధి చేసిన భూమి( ప్లాట్లు )ని రైతులకు ఇచ్చారు. ఈ పరిణామం భూమిలిచ్చిన రైతుల జీవనోపాధిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో భవిష్యత్‌లో తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఆదాయం లేక నగరాల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం చెందుతున్నాయి. ఆదాయం సంపాదించడమే వాటి ప్రథమ లక్ష్యంగా మారింది. ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, నిధులు ఇవ్వకుండా స్వంత ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని నిర్దేశిస్తోంది. ఆ క్రమంలోనే ఉప్పల్ బగాయత్ స్ఫూర్తితో భూ బ్యాంకుల ఏర్పాటు, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియతో ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిందిగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం మార్గనిర్దేశం చేసింది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వాటి ప్రకారం రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేసిన తర్వాత 60శాతం రైతులకు తిరిగి ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియతో అభివృద్ధి చేసిన భూమిలో పేదవర్గాల ఇళ్ల నిర్మాణానికి కూడా కొంత భూమిని కేటాయించాలి.
ప్రశ్న: వరంగల్ మహానగరానికి ల్యాండ్ పూలింగ్ అవసరమా..?
సుధాకర్ : సాధారణంగా నగరాలపై మౌలిక వసతుల పరికల్పనకు పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియతో శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు నిర్మిస్తారు. వరంగల్ నగరంలో కార్పొరేషన్ ఏర్పడి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ మౌలిక వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగలేదు. శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు నిర్మించాల్సిన ఒత్తిడి కూడా వరంగల్‌పై లేదు. అదీగాక నగరంలోనే మౌలిక వసతుల కల్పన పూర్తిస్తాయిలో జరగనప్పుడు శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు నిర్మించి, అందులో వసతుల కల్పన ఎంతమేరకు జరుగుతుందనేది సందేహమే. దీనిని బట్టి చూస్తే.. వరంగల్ శివారులో చేపడుతున్న ల్యాండ్‌పూలింగ్ ప్రక్రియ ఉద్దేశం శాస్త్రీయమైన నగర విస్తరణ కాదని, కుడా(కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆదాయం కోసమేనని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఆదాయం కోసం పచ్చని పంట పొలాలలను కాంక్రీట్ అరణ్యాలుగా మార్చడం అనేది అమానుషం. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన పర్యావరణ నిబంధనలకు కూడా విరుద్ధం. రైతులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండా ల్యాండ్‌పూలింగ్‌పై సర్వే చేయడం, రైతులకు చెందిన భూ వివరాల సర్వే నంబర్లతో నోటిఫికేషన్ విడుదల చేయడం చట్టవిరుద్ధం. ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా కుడా ఉల్లంఘించినట్టే. రైతుల సందేహాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైలా గ్రోత్ కారిడర్లను నిర్మించడానికి 22వేల ఎకరాల భూమి అవసరమా..? అసరమైనదానికంటే ఎక్కువ భూమిని సమీకరించడంపై ప్రభుత్వ ఉద్దేశం పట్ల సందేహాలకు తావిస్తోంది. అభివృద్ధి కంటే.. స్థిరాస్తి వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భూమి అభివృద్ధి జరిగినా.. భవిష్యత్‌లో ఆ భూమికి డిమాండ్ లేకపోతే రైతుల పరిస్థితి ఏమిటి..? రైతులు తమ జీవనోపాధిని శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి ప్రస్తుతానికి వరంగల్ నగరానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆలోచన చేయకపోవడమే ఉత్తమం.
ప్రశ్న : ల్యాండ్ పూలింగ్‌తో పర్యావరణ పరంగా వరంగల్‌పై ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయి..?
సుధాకర్ : సాధారణంగా చెరువులు, కుంటలు, పచ్చటి పంట పొలాలు విస్తరించి ఉన్న ఆవరణ కొన్ని కిలోమీటర్ల వరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. పచ్చటి పంట పొలాలు, చెరువులు కొన్ని కిలోమీటర్ల మేరకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. మంచి వాతావరణాన్ని కల్పిస్తాయి. వరంగల్ శివారులో 22వేల ఎకరాల పంట భూములను నివాస ప్రాంతాలుగా మారిస్తే.. పంట పొలాల ఆవరణం నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి నగర ప్రజలకు కరువవుతుంది. వాయు, జల కాలుష్యం సంభవిస్తాయి. భూగర్భ జలాలు తగ్గిపోయి ల్యాండ్ పూలింగ్ భూముల వెంట ఉన్న కుంటలు, చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ చెరువులు, కుంటలు కూడా మాయమై కాంక్రిట్‌గా మారి, భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఆ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. మన వరంగల్‌లో సంభవిస్తున్న వరదలకు చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణే ప్రధాన కారణం. పచ్చటి పంట పొలాలు మాయం కావడంతో రకరకాల జీవజాతులు, వృక్షజాతులు అంతరించి జీవవైవిధ్యంలో మార్పులు సంభవిస్తాయి. పెరుగుతున్న పట్టణీకరణ నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతోంది. నగరాలు ఉష్ణద్వీపాలుగా మారుతున్నాయి. కర్బన ఉద్ఘారాలు విపరీతంగ పెరిగి నగర ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తాయి. ప్రధానంగా, పంట పొలాలపై ఆధారపడిన కూలీలకు జీవనోపాధి కరువవుతుంది. పంట దిగుబడులు తగ్గిపోతాయి. నగరానికి ఆహార భద్రత ప్రమాదం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రజల కొనుగోలు, వినియోగ సామర్థ్యం క్షీణిస్తుంది. ఆ విధంగా ఆర్థికపరంగ ఆకూడా అనేక ప్రతికూల ప్రభావాలు నగరంపై గ్రామీణ ప్రజలపై సంభవిస్తాయి.
ప్రశ్న : ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు ప్రత్యామ్నాయం ఉందా..?
సుధాకర్ : ప్రత్యామ్నాయం ఉంది. యూరప్ దేశాల్లోని శివారు గ్రామాల్లో ఉద్యానవన పంటలను, వాణిజ్య పంటలను, ఇతర ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఆ రకంగా నగరాలకు ఆహార భద్రత ఏర్పడుతుంది. అలాగే, నగరాలు గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్లుగా ఉపయోగపడుతాయి. ఆ విధంగా రెంటికీ ప్రయోజనం కలుగుతుంది. నిజంగా, మన వరంగల్ మహానగరానికి ల్యాండ్ పూలింగ్‌కు ప్రత్యామ్నాయంగా అద్భుతమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శివారు గ్రామాల రూపంలో మంచి సంపద ఉంది. విద్యా, వైద్యం, రోడ్లు, పారిశుధ్యం, ఇంటర్నెట్ వంటి నగర సౌకర్యాలను ఈ గ్రామాల్లో అభివృద్ధి పర్చి వాటిని స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి. ఈ విలేజ్‌లే టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చెందుతాయి. నగరంపై ఒత్తిడి తగ్గి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అవసరం తప్పుతుంది. పచ్చటి పంట పొలాలతో గ్రామాలు, నగరాలు శోభిల్లుతాయి. వరంగల్ నగరానికి ఈ భావన అక్షరాలా వర్తిస్తుంది. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా, ప్రభుత్వ భూములు వేలం వేసి ఆదాయం సంపాదించడానికి బదులుగా ఈ భూముల్లోనే టౌన్‌షిప్‌లుగా డెవలప్ చేస్తే బాగుంటుంది. పచ్చ పంట పొలాల సమీకరణకు బదులుగా ప్రభుత్వ భూముల్లో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసి బలహీనవర్గాలకు కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.