అక్షరశక్తి, భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట శివారు ఉన్న పాండవుల గుట్టకు ఆగస్టు 20వ తేదీన రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాండవుల గుట్ట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గుట్ట కింద నుండి గుట్ట పైకి మెట్ల మార్గంలో కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. గుట్టపైన ఉన్న పాండవుల గుహ, కుంతీ గుహ, మేకల బండ, మింగీస బండ, కోట కట్టలు, పురాతన గుహ, శిలా తోరణం లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ రోజున రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారని ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మేడిగడ్డ పర్యటనకు రోడ్డు మార్గంలో వచ్చిన సందర్భంలో పాండవుల గుట్ట ప్రాంతాలను బస్సులోంచి చూపించి, ఆ గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం ను కోరినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ మేరకు పాండవుల గుట్ట ను అభివృద్ధి చేసేందుకు పర్యాటక మంత్రి ఈ గుట్టలను రానున్నారని, అవసరమైన నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పాండవుల గుట్ట పైనుండి బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుట్టకు నేరుగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రావులపల్లి, తిరుమలగిరి, జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కొత్తపల్లి(బీ), జూబ్లీనగర్ గ్రామాల నుండి పాండవుల గుట్ట కు వచ్చే అన్ని రోడ్లను డెవలప్ చేసేలా ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.