Friday, July 26, 2024

తూర్పుకు వెళ్లి త‌ప్పు చేశా..! వైర‌ల్ అవుతున్న కొండా సురేఖ వీడియో

Must Read
  • 2018లో ప‌ర‌కాల‌లో వ్యాఖ్య‌లు
  • వైర‌ల్ అవుతున్న కొండా సురేఖ వీడియో
  • వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల్లో తీవ్ర చ‌ర్చ‌
  • కాంగ్రెస్ పార్టీలో గంద‌ర‌గోళం
  • ఐదేళ్లూ ప‌ట్టించుకోలేద‌ని క్యాడ‌ర్‌లో నిరుత్సాహం
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒక్క‌రినీ గెలిపించ‌లేద‌నే విమ‌ర్శ‌లు
  • క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆదుకోలేదనే ఆవేద‌న‌
  • ఎన్నిక‌ల ముంగిట కొండా దంప‌తుల‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ తూ ర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కొండా సురేఖ అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన నిర్మాణం లేక గంద‌ర‌గోళానికి గుర‌వుతుండ‌గా… మ‌రోవైపు 2018 ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన త‌ర్వాత ప‌ర‌కాల‌లో కొండా సురేఖ‌, కొండా ముర‌ళీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎన్నిక‌ల ముంగిట‌ ఈ వీడియో కొండా దంప‌తులను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. వ‌రంగ‌ల్ తూర్పునియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా మాట్లాడిన కొండా దంప‌తులు.. మ‌ళ్లీ ఇక్క‌డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే చ‌ర్చ ప్ర‌జ‌ల్లో సాగుతోంది. 2018 ఎన్నిక‌ల త‌ర్వాత ఏనాడూ వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని, కరోనాతో త‌ల్ల‌డిల్లుతున్న‌జ‌నాన్ని ఆదుకోలేద‌నే ఆవేద‌న కూడా జ‌నంలో వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎన్నిక‌ల ముంగిట వ‌రంగ‌ల్ తూర్పుకు వ‌చ్చార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

వ‌రంగ‌ల్ ఈస్ట్‌కు వెళ్లి త‌ప్పు చేశా…

2014 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ గెలిచారు. అనంత‌రం 2018 ఎన్నిక‌ల ముంగిట కొండా దంప‌తులు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. తూర్పు నుంచి పోటీ చేయ‌కుండా ప‌ర‌కాల నుంచి కొండా సురేఖ బ‌రిలోకి దిగారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌ర‌కాలలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక అత్త‌గారింటికి పోయిన‌ ఆడ‌బిడ్డ పుట్టింటికి వ‌స్తే.. ఈరోజు మిమ్మ‌ల్ని అంద‌రినీ చూసిన త‌ర్వాత అంత సంతోషంగా ఉంది. నేను చాలా బాధ‌ప‌డేదాన్ని. ఇంత‌మంచి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిస్థితుల ప్ర‌భావంతో విడిచిపెట్టి.. ఈరోజు వరంగ‌ల్ ఈస్ట్‌కు వెళ్లి త‌ప్పు చేశానా.. అని చెప్పి.. మ‌ళ్లీ ప‌రకాల‌కు మ‌మ్మ‌ల్ని పంపించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది.. అని కొండా సురేఖ అన్నారు. ఇదే సంద‌ర్భంగా ప‌రకాల నాయ‌కుల‌ను, ప్ర‌జ‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను న‌మ్మే మ‌ళ్లీ కాంగ్రెస్‌కు వ‌చ్చామ‌ని తెలియ‌జేస్తున్నా.. అని కొండా ముర‌ళి అన్నారు. ఇప్పుడు ఈ వీడియో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైర‌ల్ అవుతోంది.

ఐదేళ్లూ ప‌ట్టించుకోలే…

2018 ఎన్నిక‌ల్లో ప‌రకాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొండా సురేఖ‌.. ఆ త‌ర్వాత దాదాపు 2023 ఎన్నిక‌ల వ‌ర‌కూ సైలెంట్‌గానే ఉండిపోయారు. ఏనాడు కూడా అటు ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను, క్యాడ‌ర్‌ను, ఇటు వరంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌ను, క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే.. ఈ క్ర‌మంలో గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌చ్చే డివిజ‌న్ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవ‌డంలో విఫ‌లం చెందార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను కొండా దంప‌తులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. క‌నీసం ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేక‌పోయారు. అంతేగాకుండా, క‌రోనా మ‌హ‌మ్మారి ఆప‌ద కాలంలోనూ కొండా దంప‌తులు క‌నీసం ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు కూడా బ‌లంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో దీంతో కాంగ్రెస్ క్యాడ‌ర్ తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయింది. దీంతో ఎవ‌రిదారి వారుచూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం బ‌ల‌హీన‌ప‌డిపోయింది.

అంద‌ని క్యాడ‌ర్ స‌హ‌కారం..?

ఐదేళ్లూ త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని, క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ త‌మ‌ను ఆదుకోలేద‌నే అసంతృప్తి అటు కాంగ్రెస్ క్యాడ‌ర్‌తోపాటు సామాన్య జ‌నంలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కొన్ని స్థానాల‌నైనా గెలిపించుకుంటే.. పార్టీ నిర్మాణాన్ని కాపాడుకుంటే.. ఈరోజు ఈ ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉండేవికాదుక‌దా..? అనే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు తీరా ఈ ఎన్నిక‌ల ముంగిట మ‌ళ్లీ పోటీ చేస్తే.. ఎలా ప‌నిచేస్తాం..? అనే ప్ర‌శ్న‌లు కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, వ‌రంగ‌ల్ తూర్పు వెళ్లి త‌ప్పు చేశాను.. అని అన్న కొండా సురేఖ‌.. మ‌ళ్లీ ఎందుకు ఇక్క‌డి నుంచి పోటీ చేస్తున్నార‌ని, వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కంలేని కొండా ముర‌ళి.. మ‌ళ్లీ ఎందుకు ఇక్క‌డ తిరుగుతున్నార‌నే ప్ర‌శ్న‌లు జ‌నం నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో కొండా సురేఖ అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img