- బార్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల నుంచి నెలనెలా మామూళ్లు..!
- అర్ధరాత్రి ఒంటి గంట వరకు పర్మిషన్
- ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ల ఇష్టారాజ్యం
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే ఇద్దరు సీఐల తీరు చర్చనీయాంశం అవుతోంది. విధుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేగాక వసూళ్ల పర్వానికి తెరలే పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ నగరంలో రాత్రి 11:30 గంటలకే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలన్న నిబంధనలు ఉన్నా సదరు యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటూ రాత్రి 1 గంట వరకు పర్మీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఓ లా అండ్ ఆర్డర్ సీఐతో పాటు ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న సీఐ వేర్పేరుగా ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు హోంగార్డులతో ఈ తతంగం నడిపి స్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిళ్లు బార్లు, బెల్ట్‌షాపులు, బిర్యాని సెంటర్లు, హోటల్లు, పాన్‌షాపులు మధ్యరాత్రి 1 గంట వరకు నగరంలో పలుచోట్ల తెరుస్తున్నప్పటికీ పట్టించుకునే వారు లేరు. ఈక్రమంలోనే రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ట్రాఫిక్ సీఐ హవా..
హన్మకొండ పరిధిలోని ఓ ట్రాఫిక్ సీఐ వ్యవహారం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశం అవుతోంది. నగర పరిధిలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి నెలనెలా ముడుపులు తీసుకుంటున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, సమస్య పరిష్కరించుకోవాలని ఒత్తిడి తేవడంతో ఇటీవల హన్మకొండలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బడా వస్త్ర దుకాణం యాజమాన్యం సదరు ట్రాఫిక్ సీఐకి పెద్ద మొత్తంలో ముట్టజెప్పి నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదేకాక.. ఇనుప సమాను దుకాణాల నుంచి నెలకు రూ. 20వేలు, బార్ షాపుల నుంచి నెలకు రూ. 15వేలు, రెడిమిక్స్, ఇసుక ట్రాక్టర్ల నుంచి, కొబ్బరి బోండాల దుకాణాల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాక.. తన వద్ద విధులు నిర్వహించే కిందిస్థాయి సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్సనల్ వెహికిల్‌కు సైరన్ ఉండకూడదనే నిబంధనలు ఉన్నా అవేవీ వర్తించవు అన్నట్లు తన సొంత వాహనానికి సైరన్, బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటుచేసి దర్జాగా రోడ్లపై తిరుగుతుండటం గమనార్హం.
లా అండ్ ఆర్డర్ సీఐది అదే తంతు..
హన్మకొండ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లా అండ్ ఆర్డర్ సీఐ పై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. మామూళ్ల మత్తులో జోగుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం కింద తన పరిధిలోని వైన్స్, బార్ల యాజమాన్యాలను పిలిపించి షాప్ కో రేటు చొప్పున ఫిక్స్ చేసి నెలనెలా మామూళ్లు పంపాలని హుకుం జారీచేసినట్లు సమాచారం. వసూళ్ల కోసం తన గన్‌మెన్‌తోపాటు పెట్రోకార్ కానిస్టేబుల్, లాంగ్‌స్టాండింగ్ హోంగార్డుతోపాటు కోర్టు డ్యూటీచేసే కానిస్టేబుల్ ను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఇదే స్టేషన్‌లో ఇరవై ఏండ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సెటిల్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పెట్రోకార్ డ్రైవర్ విధుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ షాపులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఇలాంటి పోలీసులపై ప్రత్యేక దృష్టి సారిం చాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. గతంలో సీపీగా రంగనాథ్ బాధ్యతలు చేపట్టినప్పుడు అవినీతి అధికారుల భరతం పట్టడంతో కాస్త సైలెంట్ అయ్యారని, ఇప్పుడు మళ్లీ కొందరు అధికారులు తీరు మార్చుకోవడంలేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.