అక్షరశక్తి, డెస్క్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. అదనపు బరువు ఆమె ఆశలను తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’ అని పేర్కొంది. రెజ్జింగ్ 2001-2024 గుడ్‌బై అంటూ ట్వీట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్ 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. గత రెండు ఒలింపిక్స్‌లను తలపిస్తూ పారిస్‌లోనూ వినేశ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. రియోలో కాలు విరిగితే..టోక్యోలో ఆదిలోనే ఓటమి..ఇప్పుడు పారిస్‌లో అనర్హత వేటు ఫోగాట్ పతక కలను చిదిమేశాయి. పారిస్‌లో పతకమే లక్ష్యంగా వినేస్ పోటీకి దిగింది. తన రెగ్యులర్ విభాగం 53కిలోలు కాకుండా ఈసారి 50కిలోల కేటగిరీ ఎంచుకున్న ఫోగాట్ క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది.