అక్షరశక్తి, శాయంపేట : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చనిపోయిన వారిలో దండెబోయిన విమల, బాబు రేణుక, పూల మంజుల, చల్లా అయిలు కొమురక్క ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే… శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన సుమారు 30 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి మిర్చి తోటలో పని కోసం ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ \క్రమంలో శాయంపేట మండలం మందారిపేట వద్దకు రాగానే భూపాలపల్లి నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న లారీ కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీని ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొంది. దీంతో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, దవాఖానలో చికిత్స పొందుతూ మరో మహిళ మరణించింది. తీవ్ర గాయాలపాలయిన మరో ఎనిమిది మందిని పోలీసులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. శాయంపేట ఎస్సై వీరభద్రరావు, పరకాల ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో పత్తిపాక గ్రామంలో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.