అక్షరశక్తి, హనుమకొండ: భారీ వర్షాలు కురుస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద ముంప్పు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. ఆదివారం వరంగల్ పోతన నగర్ సమీపంలోని భద్రకాళి చెరువు కట్ట వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రమాదం చోటు చేసుకోకముందే చెరువు కట్ట వద్ద ఇసుక బస్తాలతో నివారణ చర్యలు చేపట్టాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాలను, నిండిన చెరువులు, కుంటలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. మరిన్ని రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలమయమైన లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షితంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, సాగునీటిపారుదల శాఖ డిఈ హర్షవర్ధన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.