అక్షరశక్తి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లు ఆదివారం వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, యెనుమాముల మార్కెట్ రోడ్, చాకలి ఐలమ్మ నగర్ లలో జలమయమైన లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి ప్రజలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వారికి వివరించి, ఇండ్లు ఖాళీ చేసి సమీప పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తెరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. యెనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిలో ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని గమనించిన కలెక్టర్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈస్ట్ జోన్ డి ఎస్ పి కి చారవాణిలో సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల పరిస్థితులలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని తెలిపారు. అతి భారీ వర్షాల నేపద్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు జిడబ్ల్యూఎంసీ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఇక్బాల్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.