- చెరువులకు అందని ఎస్సారెస్పీ జలాలు
- మరమ్మతుల పేరుతో విడుదల చేయని అధికారులు
- కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల కుమ్మక్కు ?
- వందల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు
- దయనీయ స్థితిలో కౌలు రైతులు
- కన్నెత్తి చూడని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ
అక్షరశక్తి, మహబూబాబాద్ ప్రతినిధి : మరమ్మతు పేరుతో చెరువులకు ఎస్సారెస్సీ జలాలు అందకుండా చేస్తున్నారా..? మరమ్మతుల వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల కాసుల కక్కుర్తి దాగివుందా..? వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొత్తుకుంటున్నాపట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యం ఇదేనా..? అంటే మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న తాజా పరిస్థితులు ఔననే చెబుతున్నాయి. యాసంగిలో ఎస్సారెస్పీ జలాలు విడుదల చేస్తామని, పంటలు వేసుకోండని చెప్పిన అధికారులే నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా.. అనేక సాకులు చెబుతూ దాటవేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలను కాపాడేందుకు తాము బాగా కష్టపడుతున్నామంటూ పైపైకి నటిస్తూనే.. తాము చేయదల్చుకున్నది హాయిగా చేసుకుపోతున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. చెరువుల మరమ్మతు ఉన్నప్పుడు ముందస్తుగా ఆయా చెరువుల కింద ఉన్న రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆ గ్రామాల్లో రైతులకు తీవ్ర నష్టం
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, తదితర మండలాల్లో చెరువులకు ఎస్సారెస్సీ జలాలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లికుదురు మండలం మునిగిలవీడు గ్రామంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ గ్రామంలోని చెరువుల కింద సాగు చేసుకుంటున్న పంటలన్నీ దాదాపుగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ జలాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సవటకుంట, గునుకుంట, దావకుంట, మామిడికుంట చెరువుల మరమ్మతుకు అధికారులు ఎస్టిమేషన్ వేశారు. ఈ చెరువుల కింద యాసంగిలో వందల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. అయితే.. ముందస్తుగా రైతులకు ఎలాంటి సమాచారం అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. ఎస్సారెస్పీ జలాలు వస్తాయన్న ఆశతో యాసంగిలో రైతులు వరిసాగు చేశారు. తీరా నాట్లు వేసిన తర్వాత నీరు రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఇక నడిమిచెరువు కింద దళితుల భూముల్లో వరినార్లు పోసి నీరు రాక వదిలేశారు. చాలా చోట్ల పొట్టదశలో పంటలు ఎండిపోతున్నాయి. చెరువులకు దగ్గరలో ఉన్న బావులు, బోర్లు కూడా అడుగంటిపోయాయి. శ్రీరామగిరి, రావిరాల, చెట్లముప్పారం, మునిగిలవీడు, బొజ్జన్నపేట, మదనతుర్తి, బంజర చెరువులకు ఎస్సారెస్పీ జలాలు రాలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఒక నిమిషంపాటు బోరు నడిస్తే.. పదినిమిషాలు ఆగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు…
ఎస్సారెస్పీ జలాల విడుదలపై సంబంధిత ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడం గమనార్హం. నీటిని తీసుకురావడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పంటలను కాపాడి రైతులను ఆదుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూనే.. మళ్లీ చెరువుల మరమ్మతు ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు. చెరువుల మరమ్మతు ఉన్నట్లు ముందస్తుగానే రైతులకు సమాచారం ఇస్తే.. ఎవరు కూడా వరినాట్లు వేయకుండా ఉండేవాళ్లు కదా..? అంటే.. అనేక డొంకతిరుగుడు సమాధానాలు అధికారుల నుంచి వస్తుండడం గమనార్హం. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపీ కవిత తదితర ప్రజాప్రతినిధులు రైతులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. పంటలు ఎండిపోతున్నా.. కనీసం కన్నెత్తి చూసిన వారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎండిపోయిన పంటలను పరిశీలించి, నష్టపరిహారం ఇప్పించి, తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటలన్నీ ఎండిపోయాయని, ఇక తాము కౌలు ఎలా కట్టాలంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.