అక్షర శక్తి,హసన్ పర్తి: తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సేవాలాల్ మహారాజ్ అధ్యక్షులు భీమ్లా నాయక్ అన్నారు. హాసన్ పర్తి మండలం రామారంలోని గణేష్ నగర్ లో మేరమ్మ యాడి, సేవాలాల్ మహారాజ్ జ్ఞాపకార్ధం నవరాత్రులు తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు ఆనందోత్సవాలతో తీజ్ పండుగను తొమ్మిది రోజులు జరుపుకన్న అనంతరం గురువారం ప్రజలు తమ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. తీజ్ చివరి ఘట్టం కావడంతో ప్రజలు బంధువులతో సంబరాలలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ అధ్యక్షులు భీమ్లా నాయక్ మాట్లాడుతూ బంజారా, లంబాడి సాంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలో అతి ముఖ్యమైనది తీజ్ అని పేర్కొన్నారు. ఈ పండుగను పెళ్లి కానీ అమ్మాయిలు శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. బంజారా, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాడే గంగు నాయక్, కొర్రా లక్ష్మణ్, అజ్మీర రాజు, శక్రు నాయక్ ఏఎస్ ఐ జనార్ధన్, రాజు హేమానాయక్ తదితరులు పాల్గొన్నారు.