Saturday, July 27, 2024

రైతన్నా.. నేనొస్తున్నా!

Must Read
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
  • దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించనున్న సీఎం
  • మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలాది ఎక‌రాల్లో పంట‌న‌ష్టం
  • ఉద‌యం 11:30గంట‌లకు న‌ర్సంపేట‌కు
  • ఆ త‌ర్వాత ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లికి..
  • ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌నున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఆశ‌గా ఎదురుచూస్తున్న బాధిత రైతులు
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : అకాల వ‌ర్షాల‌తో పంట‌న‌ష్ట‌పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతుల‌ను ఓదార్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓరుగ‌ల్లుకు క‌ద‌లిరానున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించి రైతన్నల‌ కంట‌నీరు తుడువ‌నున్నారు. సీఎంతో క‌లిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉన్నతాధికారులు పంట‌ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో, హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో, భూపాలప‌ల్లి జిల్లా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది ఎక‌రాల్లో మిర్చి, మొక్క‌జొన్న‌, అర‌టి, కూర‌గాయ‌లు, చిరుధాన్యాల‌ పంట‌లు వంద‌శాతం దెబ్బ‌తిన్నాయి.

జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వ‌ర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని క‌లిశారు. ఈ సందర్భంగా తాను స్వ‌యంగా పంట‌ల‌ను ప‌రిశీలించి, రైతుల‌తో మాట్లాడుతాన‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌ నుంచి 12:30గంట‌ల వ‌ర‌కు న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో, ఆ త‌ర్వాత ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు.

మూడు నియోజ‌క‌వ‌ర్గాలు.. వేలాది ఎక‌రాలు

వరంగల్ జిల్లాలో 11, 12వ తేదీల్లో కురిసిన‌ వడగండ్ల వర్షానికి వేరుశెనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి, చిరుధాన్యాల పంటలు నేలమట్టమయ్యాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. సుమారుగా జిల్లాలోని 311 గ్రామాలకు చెందిన 13 వందల 128 మంది రైతులకు చెందిన‌ 18701 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అగ్రికల్చర్ అధికారులు తెలిపారు. అలాగే… హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఆరు మండ‌లాల్లో సుమారు 10వేల ఎక‌రాల్లో మిర్చి పంట దెబ్బ‌తిన్న‌ది. మొక్క‌జొన్న 7వేల ఎక‌రాలు, అర‌టితోట‌లు 21 ఎక‌రాలు, కూర‌గాయ‌లు 546 ఎక‌రాల్లో దెబ్బ‌తిన్నాయి. మిగ‌తా పంట‌లు 46 ఎక‌రాల్లో న‌ష్టం జ‌రిగింది. ఇక భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ఏడు మండ‌లాల్లో 7వేల ఎక‌రాల్లో మిర్చి, 500ఎకరాల్లో మొక్క‌జొన్న వంద‌శాత పంట న‌ష్టం జ‌రిగింది. మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని 19మండలాల్లో మిర్చి 34700 ఎక‌రాల్లో, మొక్క‌జొన్న 15,500 ఎక‌రాలు, అర‌టి 170 ఎక‌రాలు, కూర‌గాయ‌లు 700 ఎక‌రాలు వంద‌శాతం న‌ష్టం జ‌రిగింది. చిరుధాన్యాల పంట‌లు 800 ఎక‌రాల్లో వంద‌శాతం న‌ష్టం జ‌రిగిన‌ట్లు అధికారులు అంచ‌నా వేశారు.

ముందుగా ఆ గ్రామాల్లోనే

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న న‌ర్సంపేట మండ‌లంలో జ‌రుగ‌నుంది. ఈ మండ‌లంలోని దాస‌ర‌ప‌ల్లి, క‌మ్మాప‌ల్లి, చంద్ర‌య్య‌ప‌ల్లి, భాంజిపేట గ్రామాల్లో ఎక్కువ‌గా మిర్చి సాగు జ‌రుగుతుంది. మిర్చిరైతులు ఎక్కువ‌గా ఉంటారు. న‌ష్టం కూడా అపారంగా జ‌రిగింది. ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి వెంట‌నే స్పందించి పంట‌ల‌ను ప‌రిశీలించారు. రైతుల‌ను ఓదార్చారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ న‌ర్సంపేట మండ‌లంలో ప‌ర్య‌టించి, ఇక్కడి రైతుల‌తో మాట్లాడ‌డ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రైతులు ఎంతో ఆశ‌గా చూస్తున్నారు. సీఎం కేసీఆర్ త‌మ‌ను ఆదుకుంటార‌న్న న‌మ్మ‌కంతో రైతులు ఉన్నారు. పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాట్లలో ఉన్నారు. ఎక్క‌డ కూడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img