- బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ వ్యూహాత్మక అడుగులు
- నియోజకవర్గంలో విస్తృత ప్రచారం.. అన్ని వర్గాలతో మమేకం
- బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ చరిష్మా గెలపిస్తుందన్న ధీమా..
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు బీజేపీకి పట్టున్న వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్‌కు కంచుకోటగా మారింది. దీంతో పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే పార్టీ కోసం కష్టపడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండే బలమైన నేతగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌కు వర్ధన్నపేట బీజేపీ టికెట్ కేటాయించింది. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీపడినా శ్రీధర్ అభ్యర్థిత్వానికే అధిష్టానం ఓకే చెప్పింది. స్థానికుడిగా, సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా, ప్రజలతో మమేకం అయ్యే నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మె ల్యే కొండేటి శ్రీధర్‌కు టికెట్ దక్కడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేఖత, ప్రధాని మోడీ ఛరిష్మా ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తామన్న ధీమాతో ఉన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి..
2020లో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొండేటి శ్రీధర్.. జిల్లాలో పార్టీ బలోపేతా నికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. అనతి కాలంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోటీపడి బీజేపీని నిలబెట్టారు. ముఖ్యంగా సొంత నియోజకవర్గమైన వర్ధన్నపేటపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటూ అధికార బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని బీజేపీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే, మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈక్రమంలోనే ప్రజల్లో ఉన్న పలుకుబడిని, పార్టీకి అందించిన సేవలను గుర్తించిన హైకమాండ్ కొండేటి శ్రీధర్‌కే వర్ధన్నపేట బీజేపీ టికెట్ కేటాయించింది.
బలం పెంచుకుంటూ ముందుకు..
గతంలో కన్నా.. వర్ధన్నపేట నియోజకవర్గంలో బీజేపీ బలపడుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి గ్రేటర్ వరంగల్‌కు సంబంధించి 13 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో సుమారు ఒక లక్షా నలభైవేల ఓట్లు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. ఒకటో డివిజన్, 2వ డివిజన్, 44వ డివిజన్, 66వ డివిజన్‌లలో పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగతా డివిజన్లలో కొద్ది పాటితేడాతో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ డివిజన్ల నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు సుమారు 30వేల ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థులకు సుమారు 40వేల ఓట్లు, ఇక కాంగ్రెస్‌కు 12వేల ఓట్లు వచ్చాయి. ఇక నియోజకవర్గ కేంద్రమైన వర్ధన్నపేటలోనూ బీజేపీ కొంత బలంగానే ఉంది. పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోనూ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిపెట్టిన కొండేటి శ్రీధర్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.