- వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య !
- ఉత్కంఠకు తెరదించనున్న హైకమాండ్
- రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన!
- సీఐ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి సాంబన్న
- ఒడిదొడుకులు ఎదురైనా ఇరవై ఏండ్లుగా ప్రజాక్షేత్రంలోనే..
- ఉన్నత విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు..
- సీనియర్ నేతగా, సీఎం రేవంత్‌కు సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు
అక్షరశక్తి, ప్రత్యేక ప్రతినిధి: ఎదురుచూపులకు తెరపడనుంది. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ వీడనుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుట్లు సమాచారం. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం సుమారు 64 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. పోటీ తీవ్రంగా ఉండటంతోపాటు ప్రత్యర్థులకు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులతో గాంధీభవన్‌లో పలుమార్లు సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంది. ఈక్రమంలోనే నిన్న ఢిల్లీలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలోనే పలు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనేక సర్వే రిపోర్టులు, సామాజిక కోణాలతోపాటు అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించి ఎట్టకేలకు సాంబయ్య అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, పార్టీకి వీర విధేయుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న దొమ్మటి సాంబయ్యవైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి…
పరకాల మండలం మల్లక్కపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి సాంబయ్య కేయూలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అభ్యసించారు. 1989లో పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్సైగా ఉద్యోగం పొందారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో 1984లో టీడీపీలో చేరారు. 1987లో జనరల్ స్థానంగా ఉన్న మల్లక్కపల్లి నుంచి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గోదావరిఖని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ 2004లో సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే సంవంత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి టీడీపీ అభ్యర్థిగా, 2009లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2014లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం టీడీపీని వీడి రేవంత్‌రెడ్డితో కలిసి 2017 అక్టోబర్ 31న ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ నుంచి పోటీకి నేతలు ఆసక్తి చూపకపోవడంతో అధిష్టానం ఆదేశాల మేరకు బరిలో దిగిన సాంబయ్య అనూహ్యంగా టీఆర్ఎస్ గాలిలోనూ 2 లక్షల 62 వేల పైచిలుకు ఓట్లు సాధించి పట్టునిలుపుకున్నారు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా, కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. పార్టీ అప్పగించిన అనేక బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. ఈక్రమంలోనే అనేక ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు చుట్టుముట్టినప్పటికీ ప్రజలతో మమేకమై ముందుకుసాగుతున్నారు.
20 ఏండ్లుగా ప్రజల మధ్యనే..
దొమ్మటి సాంబయ్య 20 ఏండ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉన్నారు. ఈక్రమంలోనే నాలుగు పర్యాయాలు పాదయాత్రలు చేపట్టారు. 2017లో రైతుల కోసం 39 రోజులు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 రోజులు పాదయాత్ర నిర్వహించారు. గుండ్లవాగు తెగిపోతే పునర్నిర్మాణం కోసం ములుగు జిల్లా గోవిందరావు పేట నుంచి హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పార్టీ అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషిచేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపులో కీలకంగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రల్లో చురుగ్గా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. రాష్ట్రంలో పలుచోట్ల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి బహిరంగ సభలు విజయవంతమవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులైన దొమ్మటి సాంబయ్య కాకతీయ యూనివర్సిటీకి రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిపెట్టడంలో కీలకంగా నిలిచారు. పోలీస్ అధికారిగా, జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా, రాజకీయ నాయకుడిగా సాంబయ్యకు కాంగ్రెస్‌లోనేగాక ప్రతిపక్ష పార్టీల్లోనూ మెండుగా అనుచరులు, అభిమానులు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య పేరు ఖరారుచేసిందనే టాక్ వినిపిస్తోంది.
గెలుపు లాంఛనమే..!
అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించిన ఆపార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది. ఈక్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ తోపాటు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరుందుకుంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఫుల్ జోష్‌లో ఉంది. పదేళ్లపాటు ఎదురులేకుండా అధికారం చెలాచించిన గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా డీలాపడింది. ఆపార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఒక్కరొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటుండటంతో హస్తంపార్టీ రోజురోజుకూ మరింత బలం పుంజుకుంటోంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆరు స్థానాల్లో (స్టేషన్ ఘన్‌పూర్ మినహా) కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో పార్టీకి మరింత కలిసిరానుంది. దీంతో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ అభ్యర్థులకు హాట్ కేక్‌లా మారింది. టికెట్ తెచ్చుకుంటే చాలు ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అన్న భావన నేతల్లో నెలకొంది. ఈక్రమంలోనే అనేకమంది సీనియర్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అధిష్టానం ఆచితూచి పీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అయిందన్న ప్రచారం జరుగుతోంది.