అక్షరశక్తి, ములుగు : ఒక్కొక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట రాంపూర్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. గ్రామంలో దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను గుర్తించడంలో. దొంగతనాలు అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యాపారస్తులు వ్యాపార సముదాయల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమాన స్పదంగా సంచరిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసకావద్దని మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.