అక్షరశక్తి హనుమకొండ: విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యత లో భాగంగా ఏర్పాటుచేసిన సోలార్ పవర్ సిస్టమును ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడుతూ బొగ్గు మరియు ఇతర మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయ వచ్చును కానీ కొన్ని రోజులకు అవి తరిగిపోతాయని, సూర్యరశ్మి, గాలి ఇవి ఎప్పటికీ తగ్గిపోవని వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిరంత రాయంగా కొనసాగించవచ్చని అన్నారు. ఇటాచి ఎనర్జీ కంపెనీవారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీవారిని కలెక్టర్ ఇంకో ఐదు యూనిట్లను మోడల్ స్కూల్స్, గురుకు ల పాఠశాలలో ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. హిటాచి ఎనర్జీ కంపెనీ ఎండి మరియు సీఈవో వేణు మాట్లాడుతూ కంపెనీ 75 సంవత్సరాలు పూర్తి చేస్తుందని, కంపెనీ సామాజిక బాధ్యతగా మర్కాజీ పాఠశాల హనుమకొండలో సోలార్ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటి ప్రొఫెసర్లు సుబ్రమణ్యం, సైదులు, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.