అక్షరశక్తి హాసన్ పర్తి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ మేలుకో- నీరాజ్యం ఏలుకో అనే నినాదంతో సంఘటితమై పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యకర్తల సమావేశానికి బత్తిని సదానందం అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. తరతరాలుగా అణిచివేయబడిన బీసీలు అన్ని రంగాలలో తీవ్రంగా అన్యాయానికి గురైనారన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని, చట్ట సభలలో రిజర్వేషన్ కల్పించాలని, మహిళా రిజర్వేషన్ల లో బీసీ సబ్ కోటా ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన కులగణన జరిపి కులాల వారిగా జనాభా తేల్చాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నారు. యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదిగే వరకు అలుపెరుగని పోరాటాలకు బీసీలు సిద్ధం కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి బీసీ ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి, బీసీ నాయకులు ఆదరి శ్రీనివాస్, తోట బిక్షపతి ప్రసంగించారు. నవంబర్ లో జిల్లా మహాసభ నిర్వహణకు ఏర్పడిన తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా బత్తిని అనిల్, ఉపాధ్యక్షులుగా బొంతు మల్లన్న, వల్లపు వెంకన్న, బత్తిని సదానందం, ఈగ లావణ్య, సహాయ కార్యదర్శులుగా రామ్ గోపాల్ చారి, ఎస్ రవి, వీరబోయిన తిరుపతి, అనుకారి అశోక్ ఎన్నికైనారు.