అక్షరశక్తి, భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు ఉపాద్యాయులు, విద్యార్ధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులతో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఐఐఐటీ బాసరలో సీటు పొందిన రూరల్ మండలం నేరుడుపల్లి గ్రామానికి చెందిన మారెపల్లి అక్షిత కు ఎమ్మెల్యే శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు టై , బెల్ట్, షూస్, ఐడి కార్డులను పంపిణీ చేశారు. అనంతరం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ డీపీవో నారాయణ రావు ఇతర అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు.