Monday, September 16, 2024

స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి- ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి

Must Read

అక్షరశక్తి, పరకాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను 10 ఏండ్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకొని, ధనికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. నాగయ్య పల్లె గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని, గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. లిక్కర్ స్కాంలో 5 నెలలు జైల్లో ఉండి విడుదలైన కల్వకుంట్ల కవిత జైల్ లో నుండి బయటికి రాగానే సంబరాలు చేసుకోవద్దని, బెయిల్ ఇవ్వగానే నిజాయితీపరురాలు కాదని, వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు.10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న చల్ల ధర్మ రెడ్డి తన స్వలాభం కోసం, తన కాంట్రాక్టు పనులను చేసుకున్నాడని, ఇప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తిప్పికొట్టి, నిజ నిజాలను రైతులకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెలకు 7 వేల కోట్లు అప్పులు చెల్లిస్తుందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. సెప్టెంబర్ 17 నుండి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని, ఇకపై అన్ని వైద్య సేవలకు ప్రభుత్వ హెల్త్ కార్డే ప్రామాణికం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img