- జూనియర్ క్లర్క్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగిన మారపాక కట్టస్వామి
- అనేక స్థాయిల్లో సమర్థవంతంగా విధుల నిర్వహణ
- తోటి ఉద్యోగులు, సిబ్బందితో స్నేహపూరిత సంబంధాలు
- ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు
- సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్ర
- జూన్ 30న పదవీ విరమణ
అక్షరశక్తి, కాజీపేట : భారతీయ రైల్వేలో మారపాక కట్టస్వామిది నాలుగు దశాబ్దాల ప్రయాణం.. జూనియర్ క్లర్క్‌గా విధుల్లో చేరి.. సమర్థవంతంగా పనిచేస్తూ.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటూ.. తోటి ఉద్యోగులు, సిబ్బందితో స్నేహపూరిత సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లారు. జూన్ 30, 2023న కట్టస్వామి పదవీ విరమణ పొందుతున్నారు. ఆయన స్వస్థలం కాజీపేట పట్టణం. తల్లిదండ్రులు లక్ష్మి-ముత్తయ్య. నాన్న ముత్తయ్య రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేశారు. కష్టపడి పనిచేయడం.. నీతినిజాయితీగా, క్రమశిక్షణతో ఉండడం.. తోటివారితో మర్యాదగా ప్రవర్తించడం.. ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం.. ఇలా చిన్నతనం నుంచే తల్లిదండ్రుల నుంచి నైతిక విలువలు నేర్చుకున్న కట్టస్వామి.. సుమారు 40ఏళ్ల ఉద్యోగ జీవితంలోనూ ఎక్కడ కూడా తడబడలేదు.. అమ్మనాన్నలు చూపిన అడుగుజాడల్లోనే నడిచి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన జీవితసహచరి అనురాధ సహాయసహకారాలతోనే తాను సమర్థవంతంగా విధులు నిర్వర్తించానని కట్టస్వామి చెబుతున్నారు. కట్టస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వారందరూ కూడా జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు.
సమర్థవంతంగా విధుల నిర్వహణ
మారపాక కట్టస్వామి తన సర్వీసులో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగుల నుంచి అభినందనలు పొందారు. 1983లో నల్లగొండ రైల్వే డివిజనల్ ఇంజినీరింగ్ కార్యాలయంలో జూనియర్ క్లర్క్‌గా కట్టస్వామి ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 1984లో కాజీపేటలో డీఎస్కే-2(అసిస్టెంట్ స్టోర్ కీపర్)గా బాధ్యతలు చేపట్టారు. 1986లో సీనియర్ క్లర్క్‌గా ఇక్కడే పనిచేశారు. 1986-89 వరకు ఇండిపెండెంట్ స్టోర్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1989లో కాజీపేటలో టికెట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది 1993వ పనిచేశారు. ఆ తర్వాత టీటీఈగా పదోన్నతి పొంది సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యారు. మళ్లీ 1993లో స్క్వాడ్‌లో చేరి కాజీపేటకు బదిలీ అయ్యారు. 2000లో హెడ్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(హెచ్‌టీటీ)గా పనిచేశారు. 2003-2011 వరకు కాజీపేటలో టీటీఐగా, 2011లో సీటీఐగా పదోన్నతి పొంది 2022 వరకు ఈఎఫ్టీగా పనిచేశారు. ఆగస్టు 2022 నుంచి జూన్ 2023 వరకు మంచిర్యాల బ్యాచ్ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తించి, పదవీవిరమణ పొందుతున్నారు.
సామాజిక సేవా.. అవార్డులు
జూనియర్ క్లర్క్‌గా మొదలైన కట్టస్వామి ప్రయాణం.. అంచెలంచెలుగా అనేక ఉన్నతస్థాయి బాధ్యతలు చేపట్టి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తోటి ఉద్యోగులు, సిబ్బందితో స్నేహపూరిత వాతావరణంలో పనిచేశారు. ఈ క్రమంలో ఆయనకు పలు అవార్డులు కూడా లభించాయి. 1987లో డిప్యూటీ సీఈఎన్ నుంచి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. అదేవిధంగా, 2018లో డీఆర్ఎం నుంచి ఉత్తమ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ఔట్ స్టాండింగ్ అవార్డును అందుకున్న ఉద్యోగిగా నిలిచారు. అయితే, కట్టస్వామి కేవలం తన ఉద్యోగ బాధ్యతలకే పరిమితం కాలేదు. సామాజిక సేవా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. కాజీపేటలో ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనిట్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా కట్టస్వామి నిలిచారు. ఈ క్రమంలో యూనియన్ నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ బాధ్యతలతో ఎంత ఒత్తిడిగా ఉన్నా.. ఆపదలో ఉన్నవారికి తనవంతుగా సాయం అందించేందుకు ముందువరుసలో ఉన్నారు. 2005లో వరదబాధితులకు తోటి ఉద్యోగి నాగరాజుతో కలిసి నిత్యావసర సరుకులు అందించారు. నిజానికి.. రైల్వే నుంచి వరదబాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మొదటిగా వారుగా నిలిచారు.