కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ జయశ్రీ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రజలపై పెను భారాలను మోపడం తప్ప చేసిందేం లేదన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలపై ఇంతటి ధరలను మోపడం సరికాదన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని , లేకపోతే మోడీ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి దీప మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రమ, జిల్లా కమిటీ సభ్యులు ఉమ, సునీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.