- మూడోసారి విజయం కోసం ఎమ్మెల్యే అరూరి కసరత్తు
- గత మెజార్టీ దాటేలా వ్యూహాత్మక అడుగులు
- కలిసిరానున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు
- టీఆర్ఎస్‌కు ఎదురులేదంటున్న గులాబీ శ్రేణులు
అక్షరశక్తి, వర్ధన్నపేట: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల బలాబలాలు, ప్రత్యర్థులపై రాజకీయవర్గాలతోపాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంటోంది. ఇక టికెట్ రేసులో ఉన్ననేతల కదలికల్లో మరింత వేగం పెరుగుతోంది. అయితే… ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కోసం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను గడపగడపకూ చేరుస్తూనే.. మరోవైపు గట్టుమల్లు ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతూ జనంలోకి వేగంగా వెళ్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో
పాలుపంచుకోవడం అరూరి రమేశ్‌కు కలిసివచ్చే అంశాలని అనుచరవర్గాలు అనుకుంటున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అరూరిని కేసీఆర్ నియమించడంతో ఆయన బలం మరింత పెరిగిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అరూరి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కలిసిరానున్న సంక్షేమ పథకాలు…
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అరూరి రమేష్ ఎమ్మెల్యేగా 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2014లో 86,349 ఓట్ల మెజార్టీ, 2018లో 99,240 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మంత్రి హరీశ్‌రావు తర్వాత అత్యధిక మెజార్టీ అరూరి సాధించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్.. ఇలా అనేక పథకాలను నియోజకవర్గంలోని అర్హులందరికీ రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే అరూరి అందిస్తున్నారని, ప్రజలు ఆదరిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేగాకుండా.. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల నిరుద్యోగులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశాలన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో అరూరికి కలిసి వస్తాయనే టాక్ నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అరూరికి మరింత మెజార్టీ వస్తుందని గులాబీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయ ప్రస్థానం…
అరూరి రమేష్ ఏప్రిల్ 4 , 1967న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ-గట్టుమల్లు. స్వగ్రామం ఉప్పుగల్లు మండలం జఫర్గడ్ జిల్లా జనగామ. 1995లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ పూర్తి చేసి ఆ తర్వాత ఎల్.ఎల్.బి కూడా చదివారు. రమేష్‌కు కవిత కుమారితో వివాహం జరిగింది. ఆరూరి రమేష్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, 2014లో జరిగిన ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు తెలంగాణ లెజిస్లేచర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.