అక్షరశక్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10 వేల మందికిపైగా బాధితులు రిలీఫ్ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ వయనాడ్ వెళ్లనున్నారు. ఆగస్టు 10వ తేదీన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ బయల్దేరి వెళ్తారు. అక్కడ కన్నూర్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ప్రమాద బాధితుల్ని మోదీ పరామర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, గత నెల 30వ తేదీన భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.