అక్షరశక్తి, హన్మకొండ క్రైం : సుదీర్ఘ కాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ విభాగానికి సేవలందించిన పోలీస్ జాగిలానికి అధికారులు మంగళవారం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలం బిట్టును ఘనంగా సత్కరించారు. 2013 డిసెంబర్ 26వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ జాగిలాల విభాగంలో చేరి బిట్టుపేరుతో స్నిఫర్ డాగ్‌గా సుమారు పదకొండు సంవత్సరాలు పాటు పోలీస్ శాఖకు సేవలందించింది.
ప్రధానంగా ఈ జాగిలం ప్రధాన మంత్రులు, రాష్ట్ర ముఖ్య మంత్రులతో పాటు ఇతర వి.ఐ.పిలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటించే సందర్బాల్లో పేలుడు గుర్తించడంలో కీలకంగా నిలిచింది. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ జాగిలం బిట్టుకు హ్యంగ్‌లర్‌గా కానిస్టేబుల్ ప్రభాకర్ వ్యవహరించేవాడు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో జాగిలం విభాగం చాలా కీలకమని, నేరస్తులను పట్టుకోవడంతో పాటు, ప్రేలుడు పదార్థాలతో పాటు ప్రస్తుతం నూతనంగా మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు సంజీవ్, సురేష్‌కుమార్, ఏసీపీ అనంతయ్య,ఆర్.ఐ లు శ్రీనివాస్, స్పర్జన్‌రాజ్, శ్రీధర్, చంద్రశేఖర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌కుమార్, డాగ్ స్వ్కాడ్ ఇంచార్జ్ ఆనంద్‌తో పాటు ఇతర డాగ్ స్క్వాడ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.