- ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి
- హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం
- ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్
- నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేశాడు. హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… పోలపల్లి అనూష (22) తల్లిదండ్రులతో కలిసి గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోంది. తండ్రి రాములు వెల్డింగ్ షాప్‌లో పని చేస్తుండగా, తల్లి ఇళ్లల్లో పని చేస్తుంది. అనూషకు తన మేనమామ ఊరు సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన మహమ్మద్ అజార్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రేమించాలని అజార్ అనూష వెంటబడుతున్నాడు. అనూష రెండు నెలలుగా హైదరాబాద్‌లో పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుని నిన్నరాత్రి హనుమకొండ లోని ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న అజార్.. శుక్రవారం ఉదయం పది గంటలకు తల్లిదండ్రులులేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించడంలేదన్న అక్కసుతో విచక్షణ కోల్పోయి ఫోన్‌లో మాట్లాడుతుండగా అనూష గొంతు కోసి పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ఇద్దరు క్లాస్మేట్స్ వెంటనే గాంధీనగర్‌కు చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. కాగా అనూషను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.
ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్
హన్మకొండలో ప్రేమ పేరుతో వెంటపడుతూ అనూష గొంతుకోసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం వైద్య అధికారులతో మంత్రి మాట్లాడి అనూష ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. అనూషపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.