Friday, September 13, 2024

కరోనా క‌ల‌క‌లం!

Must Read
  • మ‌ళ్లీ విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి
  • కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..

కరోనా వైరస్ చాప‌కింద నీరులా క్ర‌మంగా విస్త‌రిస్తోంది. దేశంలో కేసులు స్వ‌ల్ప స్థాయిలో మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ రెండు వేల పైచిలకు కొత్త కేసులు నమోదు కావడం, మరణాల సంఖ్య భారీగా ఉండటం కలవరపెడుతున్నది. జూన్ నాటికి నాలుగో వేవ్ తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది.

ఆ రాష్ట్రాల‌కు కేంద్రం హెచ్చరికలు

కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొవిడ్ టెస్టులు చేయగా, కొత్తగా 2,527 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 1,042 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 33 మంది బలయ్యారు. ఇందులో కేరళలో 31 మరణాలు సంభవించ‌గా, ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకూ 5.22 లక్షల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్ నుంచి 1656 మంది కోలుకున్నారు. కొంతకాలంగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది.
దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి చేరింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

రాష్ట్రంలోనూ కేసుల పెరుగుద‌ల‌

తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముందు రోజుతో పోలిస్తే ఎక్కువగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. గతరాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,265 శాంపిళ్లను పరిక్షించగా.. 32 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. మరో 20 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం తెలంగాణలో 199 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4,111గా ఉంది. అలాగే శుక్రవారం వరకూ తెలంగాణలో 7 లక్షల 91 వేల 741 కరోనా కేసులు నమోదవగా.. 7 లక్షల 87 వేల 431 మంది కోలుకున్న‌ట్లు వైద్యారోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img