- సామాజిక బాధ్యతమరిచి 32 ఎకరాల దళితుల భూమికి ఎసరు
- 1970లో కడిపికొండలో దళితులకు అసైన్డ్ భూమి కేటాయింపు
- సుమారు 20గుంటల చొప్పున యాజమాన్యహక్కు పత్రాల జారీ
- దశాబ్దాలుగా ఉమ్మడిగా వర్షాధార పంటల సాగు
- సాగునీటి సౌకర్యం లేక కొద్దికాలంగా పడావు
- కాజీపేట – కరీమాబాద్ ఉర్సు గుట్ట రహదారి అభివృద్ధితో అమాంతంగా పెరిగిన విలువ
- ప్రస్తుతం ఎకరం ధర సుమారు రూ.3కోట్లు!
- 2015లో 32 ఎకరాలను టీన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ప్రభుత్వం
- సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన దళితులు
- ఇప్పటివరకూ కోర్టు పరిధిలోనే వివాదం
- అయినా.. భూమిపైకి టీఎన్జీవోస్ వస్తున్నారంటూ దళితుల ఆరోపణలు
- తమ పొట్టకొట్టొద్దంటూ ఆవేదన
- అక్షరశక్తి, కాజీపేట : వాళ్లందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండకు చెందిన నిరుపేద దళితులు.. మూడు పూటలా కడుపునిండా తినడానికి తిండిలేని అభాగ్యులు.. ఉండడానికి కనీసం గూడు లేని మనుషులు.. కూలినాలి చేసుకుని ఏరోజుకారోజు పూటెళ్లదీసుకునే బతుకులు.. అంతటి దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దళితులకు 1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం సర్వేనంబర్ 366లో సుమారు 64 కుటుంబాలకు 20 గుంటల చొప్పున కేటాయించిన సుమారు 32 ఎకరాల అసైన్డ్ భూమే ఆధారం. నీటి సౌకర్యం లేకపోవడంతో దశాబ్దాలుగా వర్షాధారంపైనే ఉమ్మడిగా అందరూ కలిసి నువ్వులు, పజ్జొన్నలు, ఉలువలు పండించి, వాటిని పంచుకుని కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అయితే.. కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగడం, కడిపికొండ నుంచి వరంగల్ కరీమాబాద్ ఉర్సుగుట్ట వరకు రహదారి అభివృద్ధి జరుగడం.. ఆ భూమి ప్రాంతంలో ఇళ్లు, కేంద్రీయ విద్యాలయం ఏర్పడడంతో ఒక్కసారిగా విలువ పెరిగిపోయింది. ఇప్పుడా ఆ భూమి ప్రమాదంలో పడిపోయిందని, తమ బతుకుదెరువు తమదికాకుండా పోతోందని, ఆ భూమిని టీఎన్జీవోస్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కడిపికొండ దళితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే పంటలు పండించి జీవనాధారంగా ఉన్న ఆ భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ టీఎన్జీవోస్ గొడవకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.
- అందరికీ భూ యాజమాన్య హక్కు పత్రాలు
కడిపికొండలోని దళితులకు, ఇతర బీసీ వర్గాలకు 1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం సర్వేనంబర్ 366లో 64 ఎకరాల భూమిని అసైన్డ్ చేసింది. ఆ తర్వాత 1994, 1995లో అందరికీ భూ యాజమాన్య హక్కు పత్రాలు కూడా ఆర్డీవో, ఎమ్మార్వోల నుంచి అందాయి. కొందరు విరాసత్ కూడా చేయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆ భూమి మధ్యలో నుంచి కడిపికొండ – కరీమాబాద్ ఉర్సు గుట్ట రహదారి వెళ్తోంది. ఆ రహదారికి ఓ వైపు రాజీవ్ స్వగృహ ఇళ్లు, కేంద్రీయ విద్యాలయం ఉండగా, మరోవైపు దళితులకు కేటాయించిన 32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలోనే దశాబ్దకాలంగా దళితులు ఉమ్మడిగా వర్షాధార పంటలు పండించుకుని పంచుకుంటున్నారు. అయితే.. కడిపికొండ – ఉర్సు గుట్ట రహదారి అభివృద్ధి కావడం, నీటి సౌకర్యం లేకపోవడంతో కొంతకాలంగా ఆ భూమి అంతా పడావుపడి ఉంటోంది. ఇదే సమయంలో వరంగల్ ట్రైసిటీస్‌కు అత్యంత సమీపంగా ఉండడంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఎకరం భూమి సుమారు రూ.3కోట్ల ధర పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్క ప్రకారం దళితుల భూమి మొత్తం విలువ సుమారు రూ.100కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వరాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడమేగాకుండా.. ఉన్న భూమిని టీఎన్జీవోస్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే.. తాము ఎలా బతకాలని, తాము, తమ పిల్లలు ఎక్కడ నివాసం ఉండాలని దళితులు ప్రశ్నిస్తున్నారు. - వివాదం ఎలా మొదలైంది…?
2008లో తమ భూమి నుంచి ఓ ప్రైవేట్ కాలేజీకి యాజమాన్యం రోడ్డు వేయడంతో తాము అడ్డుకున్నామని, ఆ సమయంలో కాలేజీ యాజమాన్యానికి బంధువు అయిన ఎమ్మెల్యే తమపై తహసీల్దార్‌తో కేసు పెట్టించారని దళితులు చెబుతున్నారు. తాము హక్కుదారులంకాదంటూ కేసు పెట్టించగా కోర్టులో తామే గెలిచామని అంటున్నారు. ఇక అప్పటి నుంచి ఈ విలువైన భూమిపై కొందరు పెద్దల కన్ను పడిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో తమకు భూమి కేటాయించాలంటూ టీఎన్జీవోస్ అప్పటి హన్మకొండ ఎమ్మెల్యేను కోరగా, ఆయన ఈ కడిపికొండ భూమిని సూచించినట్లు దళితులు ఆరోపిస్తున్నారు. ఇక అప్పటి నుంచే ఎలాగైనా ఆ భూమిని దక్కించుకోవాలన్న ప్రయత్నంలో టీఎన్జీవోస్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అదే ఫైల్‌ను మూవ్ చేస్తూ తమ పరపతిని అంతా ఉపయోగించి 2015లో ప్రభుత్వం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి కేటాయించేలా చేసుకున్నట్లు సమాచారం. దళితులకు మూడెకరాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం.. అదే దళితుల భూమిని తీసుకుని టీఎన్జీవోస్‌కు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇదే విషయంపై కడిపికొండ దళితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ వివాదంలో హైకోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు పరిధిలో ఉన్నా టీఎన్జీవోస్ భూమిపైకి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - వివాదాస్పదంగా 32ఎకరాల కేటాయింపు
కడిపికొండలోని దళితులకు కేటాయించిన 32 ఎకరాల అసైన్డ్ భూమి వినియోగంలోలేదంటూ అప్పటి తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దానిని తిరిగి 2001లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు టీఎన్జీవోస్ చెబుతున్నారు. ఆ తర్వాతే ఆ భూమిని 2015లో తమకు కేటాయించిందని టీఎన్జీవోస్ అంటున్నారు. అయితే.. స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూమిని ఎదైనా ప్రజాప్రయోజనాల కోసం కేటాయించాలిగానీ.. ఇలా వందకోట్ల విలువైన 32 ఎకరాల భూమిని టీఎన్జీవోస్‌కు ప్రభుత్వం ఇవ్వడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. దళితులను నుంచి తీసుకున్న భూమిని ఇలా ఎలా అప్పనంగా ఓ యూనియన్‌కు ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమిలేదుగానీ… టీఎన్జీవోస్‌కు ఇవ్వడానికి మాత్రం ఎలా సాధ్యమైందంటూ దళితవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే సమయంలో టీఎన్జీవోస్ తీరుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. దశాబ్దాలుగా దళితుల చేతుల్లో ఉన్న భూమి అని తెలిసినా.. సామాజిక బాధ్యత మరిచి అదే భూమి కోసం టీఎన్జీవోస్ ప్రయత్నం చేయడం జనంలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. - మా భూమి మాకు ఇవ్వాలి- కొండూరు పుష్పనీల-కడిపికొండ
ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమికి నీళ్ల వసతి లేదు. అందుకే వర్షాలకు పడే పంటలు ఉలువలు, పెసర్లు, పజ్జొన్నలు పండించి అందరం పంచుకునే వాళ్లం. మాకు ఉన్న ఆధారం అదొక్కటే భూమి. కాలంలేక ఇప్పుడు దున్నతలేము. ఇప్పుడు మా భూమిని తీసుకుంటే మేం ఎలా బతకాలి. మా భూమి మాకే కావాలి. - మేం ఎలా బతకాలి-బస్కె మల్లేశం -కడిపికొండ
మాకు భూమి ఇచ్చినప్పటి నుంచి వర్షాలకు పండే పంటలు పండించినం. మాకు ఆ భూమి ఒక్కటే ఆధారం. ఇప్పుడు ఆ భూమిని ఎవరికో ఇస్తే.. మేం ఎలా బతకాలి. మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు లేవు. కూలినాలి చేసుకుని బతుకుతున్నాం. ఇప్పటికైనా మా భూమి మాకే ఇవ్వాలి. - పట్టా పుస్తకం కూడా ఉంది – కొండూరు హైమావతి – కడిపికొండ
మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో అందరం కలిసే పంటలు పండించినం. ఆ భూమి మా మామ పేరుమీదనే ఉంది. పట్టా కూడా ఉంది. మాకు వేరే ఆధారం లేదు. మాకు తెలియకుండా మా భూమిని తీసుకుని మోసం చేస్తున్నారు. మా భూమి మాకు ఇచ్చి ఆదుకోవాలి.
Must Read