24.7 C
Hyderabad
Homeతెలంగాణడబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదు

డబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదు

📰 Generate e-Paper Clip

– వైద్యం, ప్రజా సేవలో సంతృప్తి
– విద్యే బీసీల ఎదుగుదలకు ప్రధాన ఆయుధం
– కుల వివక్షే కసిగా మారింది
– వైద్యుడిగా ఎదిగినా.. రాజకీయాలపై మొదటి నుంచే గురి
– ఈటలే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా ప్రయాణం
– పరకాలతోనే నా బంధం
– బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు
– తెలంగాణ డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌

అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : బీసీలు, ఎస్సీలు, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నతంగా ఎదగాలంటే విద్య తప్ప మరో మార్గం లేదని, ముందుగా సామాజికంగా జ్ఞానోదయం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు అన్నారు. హక్కుల కోసం బీసీలు ఉద్యమించాలని, అదే సమయంలో అగ్రవర్ణాలను దూరం చేయకుండా తమ సమస్యలను వివరించి వారిని కూడా భాగస్వాములను చేసుకుంటేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. తనకు విద్య వృత్తి ద్వారానే చాలా గుర్తింపు లభించింది అని, ఇప్పుడు ప్రజా సేవ చేసే అవకాశం వస్తే సంతోషిస్తాను అని అన్నారు. డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన బాల్యం, చదువు, వైద్య ప్రస్థానం, ఎంబీబీఎస్‌లో ఎదురైన కుల వివక్ష, వైద్య రంగంలో వచ్చిన మార్పులు, గార్డియన్‌ ఆస్పత్రి నిర్మాణం, ఐఎంఏలో తన ప్రయాణం, బీసీ సామాజిక చైతన్యం, రాజకీయ రంగ ప్రవేశం, ఈటల రాజేందర్‌ తో తన అనుబంధం, పరకాల నియోజక వర్గంతో తనకు ఉన్న బంధం తదితర అంశాలను ఆయన పంచుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వైద్యుడిగా ఎదిగి, వైద్య సంస్థను నిర్మించి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలని సాగుతున్న ఆయన ప్రయాణం ఆసక్తికరంగా సాగింది.

విద్యతోనే వెనుకబడిన వర్గాల ఎదుగుదల

బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని కాళీ ప్రసాద్‌రావు స్పష్టం చేశారు. కేవలం హక్కుల కోసం నినదించడం కాకుండా వాటిని సాధించేందుకు సామాజికంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలు ఉద్యమించాలని, తమ హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. అయితే ఈ పోరాటం ఇతరులను దూరం చేసే విధంగా ఉండకూడదని, అగ్రవర్ణాలను కూడా తమ ఉద్యమం గురించి వివరించి కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య, చైతన్యం, ఐక్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

‘నన్ను డాక్టర్‌ చేయాలనేది నాన్న కోరిక’
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక తన స్వగ్రామమని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. తల్లిదండ్రులు పగడాల వెంకటనర్సయ్య, వజ్రమ్మ అని చెప్పారు. తమ్ముడు, చెల్లి ఉన్నారని తెలిపారు. తండ్రి టీచర్‌గా పనిచేయడంతో ఉద్యోగరీత్యా బదిలీ అయిన ప్రతిచోటికీ కుటుంబం వెళ్లాల్సి వచ్చేదన్నారు. టెన్త్‌ వరకు గ్రామాల్లోనే చదివానని, పదో తరగతి చిట్యాలలో పూర్తి చేశానని, ఇంటర్‌ పరకాలలో చదివానని చెప్పారు. చిన్ననాటి నుంచి చదువుపైనే ఎక్కువ దృష్టి ఉండేదన్నారు. తన తండ్రికి తనను డాక్టర్‌ చేయాలనే కోరిక బలంగా ఉండేదని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. అందుకే తన చదువు విషయంలో తండ్రి చాలా కఠినంగా ఉండేవారని చెప్పారు. తోటిపిల్లలంతా ఆటలకు వెళ్లినా తాను మాత్రం పుస్తకం ముందేసుకుని కూర్చోవాల్సి వచ్చేదన్నారు. తండ్రి ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఆటకు వెళ్లేందుకు అవకాశం దొరికిందని, అప్పుడు తల్లిని బతిమిలాడుకుని బయటకు వెళ్లేవాడినని చిన్ననాటి జ్ఞాపకాలను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలోనే చదువుపై ఏర్పడిన ఆ అలవాటు తర్వాత తన జీవితాన్ని మలిచిందన్నారు.

దొర కుటుంబాలను చూసి.. చదువుపై ఆసక్తి

తనలో చదువుపై ఆసక్తి పెరగడానికి గ్రామంలోని ఉన్నత కుటుంబాలను చూడటం కూడా ఒక కారణమైందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. రిటైర్డ్‌ జడ్జి రఘునందన్‌రావు గ్రామానికి వచ్చినప్పుడు ఆయనను, ఆయన పిల్లలను చూసేందుకు గ్రామస్థులు వెళ్లేవారని తెలిపారు. వారి డ్రెస్సింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడే విధానం తనను ఆకట్టుకునేవన్నారు. తాను కూడా బాగా చదువుకుంటే అలాంటి స్థాయికి ఎదగవచ్చనే ఆలోచన అప్పుడే తనలో కలిగిందన్నారు. ఆ తర్వాత చదువుపై మరింత ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు.

‘వాళ్ల తాత మంత్రి అవుతడు’

తన తాత బుచ్చిరామయ్య సర్పంచ్‌గా పనిచేశారని, తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకునేవారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. మనవళ్లందరిలో తనపై తాతకు ప్రత్యేకమైన అభిమానం ఉండేదన్నారు. తన కూతురు కొడుకు కూడా తన తాతే పేరు పెట్టడానికి కూడా ఆ అనుబంధమే కారణమన్నారు. ఎంసెట్‌ను రెండుసార్లు రాసి మూడో ప్రయత్నంలో మెడికల్‌ సీటు సాధించానని తెలిపారు. కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తి చేశానన్నారు. చదువు పూర్తయ్యాక తొలుత 2 సంవత్సరాలు ఏటూరునాగారంలో పనిచేశానని, అనంతరం 12 సంవత్సరాలపాటు ఎంజీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు. 1992లో వివాహం జరిగిందని, తన భార్య స్వర్ణలత ఎంబీబీఎస్‌, డీజీఓ వైద్యురాలని చెప్పారు. తన వ్యక్తిత్వం, తండ్రి టీచర్‌ కావడం వంటి విషయాలను చూసి తన మామ ఆకుల ఆనందం తనను వెతికి మరీ వివాహం చేశారని నవ్వుతూ తెలిపారు.

ఎంబీబీఎస్‌లోనే కుల వివక్ష అనుభవం

ఇంటర్‌ వరకు కులం గురించి తనకు పెద్దగా తెలియదని, ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాతే కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఇంటర్‌లో నలుగురు స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉండేవాళ్లమని, అప్పుడు ఎలాంటి సామాజిక భేదాల గురించి ఆలోచన రాలేదన్నారు. మెడికల్‌ కాలేజీలో చేరిన తర్వాత కొందరికి నమస్కారం పెట్టినా స్పందించకపోవడంతో కారణమేంటో అర్థం కాక చాలా కాలం ఆలోచించానన్నారు. మొదట తన డ్రెస్సింగ్‌ వల్ల కావచ్చని భావించానని, తన వద్ద 2 జతల బట్టలు మాత్రమే ఉండేవని చెప్పారు.

వివక్షే కసిగా మారింది

ఎంబీబీఎస్‌లో కుల ఆధారిత గ్రూపులు, పరస్పరం సహకరించుకోవడం, కలిసి పార్టీలు చేసుకోవడం వంటి అంశాలను గమనించడానికి తనకు ఏడాదికి పైగా సమయం పట్టిందని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. బీసీల పట్ల కనిపించిన నిర్లక్ష్యం, తాను ఎదుర్కొన్న వివక్ష తనను బాధపెట్టినా అదే తనలో మరింత కసిని పెంచిందన్నారు. ఆ కసిని చదువు, పని, ఎదుగుదల వైపు మళ్లించానని చెప్పారు. తన జీవితంలో ఎదురైన ఆ అనుభవాలే తర్వాత మరింత పెద్ద స్థాయికి ఎదగాలనే పట్టుదలను పెంచాయని వివరించారు.

యాకయ్య.. మిత్రుడే కాదు.. నా ఆత్మ

తన జీవితంలో మిత్రుడు రాజబోయిన యాకయ్య పాత్ర ఎంతో కీలకమని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన యాకయ్య తనకు మిత్రుడే కాకుండా ఆత్మలాంటి వ్యక్తి అని అన్నారు. తాను, యాకయ్య కలిసి కష్టపడ్డామని, ప్రతి దశలో ఆయన తనకు అండగా నిలిచారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు మెడికల్‌ కాలేజీ చైర్మన్లుగా ఉన్న కాలేజీ ఆర్వీఎం అని పేర్కొంటూ, యాకయ్య తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్‌ వృత్తిలోనూ ఎంతో కష్టపడ్డానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. జయ, రోహిణి ప్రాంతాల్లో పనిచేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ ఒక మండలానికి వెళ్లి వైద్యం అందించేవాడినన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. 10 సంవత్సరాలపాటు నిరంతరం కష్టపడ్డానని చెప్పారు. చివరి దశలో ఉన్న ఎంతోమంది రోగులను కాపాడినట్లు తెలిపారు. ప్రాణాలు నిలబెట్టినప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుందని అన్నారు. రఘురామ్‌, సత్యమూర్తి సార్‌లంటే తనకు ఎంతో గౌరవమని, వారు తనకు విలువలు నేర్పారని చెప్పారు.

‘నాడి పట్టుకునే డాక్టర్‌ కరువయ్యాడు’

ప్రస్తుత వైద్య వ్యవస్థపై కాళీ ప్రసాద్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు రోగులకు దూరమయ్యారని, మిషన్లు, డబ్బులు దగ్గరయ్యాయని అన్నారు. గతంలో డాక్టర్‌ రోగి నాడి పట్టి, వివరాలు అడిగి, సమస్యను అర్థం చేసుకుని వ్యాధిపై ఒక అంచనాకు వచ్చి చికిత్స చేసేవాడని చెప్పారు. ఇప్పుడు పరీక్షలు, మిషన్లపై ఆధారపడే పరిస్థితి పెరిగిందన్నారు. పరీక్షలు చేయకపోతే రోగులే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వైద్యం ఖర్చు పెరుగుతోందని, భవిష్యత్‌లో వైద్య వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

నవ్వుకున్న చోటే.. గార్డియన్‌ ఆస్పత్రి

2008లో గార్డియన్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసినప్పుడు చాలామంది తనను చూసి నవ్వుకున్నారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ములుగు రోడ్డులో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించినప్పుడు ‘ఇక్కడ ఏం డెవలప్‌మెంట్‌ ఉంటుంది’ అని పలువురు నిరుత్సాహపరిచారని చెప్పారు. అయితే తన విజన్‌పై నమ్మకంతో ఆస్పత్రి నిర్మించానన్నారు. 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి గార్డియన్‌ ఆస్పత్రిని ప్రారంభించానని తెలిపారు. రోగులకు 24/7 అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆస్పత్రి పై అంతస్తులోనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నానన్నారు. ఉద్యోగ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు పేషెంట్లను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు.

‘పేదోళ్లకు న్యాయం జరగాలే’

తాను ఆర్‌ఎంపీలు, పీఆర్‌ఓలను నమ్ముకోనని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు, ప్రజాప్రతినిధులతో మంచి అనుబంధం కొనసాగిస్తానన్నారు. ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు తమ గ్రామస్తులను ఆస్పత్రికి పంపిస్తారని చెప్పారు. బిల్లుల్లోనూ పేదలకు వీలైనంత వెసులుబాటు కల్పిస్తానన్నారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ట్రామా సర్జరీల్లో తెలంగాణలో తనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

వైద్యంతో గౌరవం.. ఐఎంఏలో మరో అడుగు

1997లో ఐఎంఏ సభ్యత్వం తీసుకున్నానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఐఎంఏ సమావేశం ఏది జరిగినా హాజరయ్యేవాడినన్నారు. 2023లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. ఐఎంఏలో బీసీలు అధ్యక్షులుగా ఎదగడానికి గతంలో అనేక ఇబ్బందులు ఉండేవని, అలాంటి పరిస్థితిని సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. వైద్య వృత్తి ద్వారా ఎంతో గౌరవం సంపాదించుకున్నానని చెప్పారు.

ఇద్దరు బిడ్డలూ డాక్టర్లే

తన ఇద్దరు కుమార్తెలూ వైద్య రంగంలోనే ఉన్నారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. పెద్ద కుమార్తె తేజస్వీ ఎంఎస్‌ ఆప్తల్మాలజీ పూర్తి చేశారని, అల్లుడు అనురాగ్‌ ఆర్థోపెడిక్‌ వైద్యుడని చెప్పారు. చిన్న కుమార్తె యశస్వి ఎండీ జనరల్‌ పూర్తి చేసిందన్నారు. రానున్న రోజుల్లో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి వారికే అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. 1983లో ఎన్టీఆర్‌ పరకాలకు వస్తున్నారని తెలిసి స్నేహితులతో కలిసి రేపాక నుంచి సైకిళ్లపై పరకాలకు వచ్చామని గుర్తుచేసుకున్నారు. ఒక్కో సైకిల్‌పై ముగ్గురు వచ్చేవారమన్నారు. టీడీపీ నాయకులతో తిరిగేవాడినని తెలిపారు. అయితే తన తాత కాంగ్రెస్‌ అభిమాని కావడంతో తనను మందలించేవారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు మున్నూరుకాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశానన్నారు.

ఈటల తోనే నా ప్రయాణం…

రాజబోయిన యాకయ్య ద్వారానే ఈటల రాజేందర్‌తో పరిచయం ఏర్పడిందని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఈటల సహకారంతోనే మెడికల్‌ కాలేజీ ప్రారంభించాననీ, తనకు రాజకీయ గురువు ఈటల రాజేందర్‌ అని స్పష్టం చేశారు. ఎప్పటికైనా ఆయన వెంట తన నడక ఉంటుందని చెప్పారు. పరకాల టికెట్‌ రావడం వెనుక ఈటల పాత్ర చాలా ఉందన్నారు. తాను టికెట్‌ కోసం ఈటలను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని చెప్పారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈటల కూడా పోటీ చేస్తారని ఒక కార్యక్రమంలో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

పరకాలతోనే నేను

ఈటల రాజేందర్‌ ప్రోత్సాహంతోనే పరకాల నియోజకవర్గంలో పనిచేస్తున్నానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. పరకాల ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తనపై నమ్మకంతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడలేదన్నారు. అయితే బీసీలు అధికంగా ఉన్న ప్రాంతంలో బీసీ బిడ్డగా తనను కాదని ఇతర వర్గాలకు చెందిన వారిని ఆదరించడం బాధ కలిగించిందన్నారు. అయినా నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని, ఫలితం వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు.
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. అందుకేనేమో తన బుర్రలో ఎప్పుడూ ‘పాలిటిక్స్‌.. పాలిటిక్స్‌’ తిరుగుతుంటుందని నవ్వుతూ అన్నారు. 2004లో 50 మంది డాక్టర్లతో కలిసి వినోద్‌కుమార్‌ సహకారంతో కేసీఆర్‌ను కలిసి హన్మకొండ టికెట్‌ అడిగినట్లు తెలిపారు. అయితే పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అవకాశం దక్కలేదన్నారు. 2005లో కార్పొరేషన్‌ మేయర్‌ అవకాశం కూడా వచ్చినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కూడా ఆఫర్‌ వచ్చిందని, పరకాలలో బీసీగా తనను బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. అయితే తన రాజకీయ ప్రయాణం ఈటలతోనే అని స్పష్టం చేసినట్లు తెలిపారు.

రాజకీయాలను కోర్సులా చదువుతున్నా

రాజకీయాలను కూడా ఒక కోర్సులా చదువుతున్నానని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. కసితో ముందుకు సాగుతున్నానన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తనవంతు సహాయం చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన ఆస్పత్రికి వచ్చే వారికి బిల్లుల్లోనూ వెసులుబాటు కల్పిస్తున్నానన్నారు. రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదని, డబ్బే కావాలంటే వైద్య రంగంలోనే సంపాదించుకునే అవకాశం తనకు ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు వచ్చిందన్నారు.

‘చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి’

ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు పెట్టాలి.. సంపాదించుకోవాలనే ధోరణి ఉందని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. ఆ ధోరణి మారాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని, రాజకీయాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో బాస్‌ ఉండాలని, లేకపోతే రాజకీయాలు చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వం అవసరమన్నారు.

డీలిమిటేషన్‌ ఇప్పట్లో కాదు…

డీలిమిటేషన్‌ పై వస్తున్న ప్రచారం అంతా ప్రచారమేనని కాళీ ప్రసాద్‌ రావు అన్నారు. డీలిమిటేషన్‌ కు సంబంధించిన అసలు అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తప్ప ఎవరికీ తెలియవని వ్యాఖ్యానించారు. అధికారికంగా నిర్ణయం వెలువడే వరకు డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఒక గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన కాళీ ప్రసాద్‌రావు ప్రయాణంలో చదువు, వైద్యం, సామాజిక అనుభవాలు, బీసీ చైతన్యం, రాజకీయ ఆసక్తి అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి కనిపిస్తున్నాయి. ఎంబీబీఎస్‌లో ఎదురైన కుల వివక్ష తనలో కసిని పెంచిందని చెప్పిన ఆయన.. అదే కసితో వైద్య రంగంలో ఎదిగానని చెబుతున్నారు. ఇప్పుడు బీసీలకు విద్య, చైతన్యం, హక్కుల కోసం పోరాటం అవసరమంటున్నారు. ఈటల రాజేందర్‌ను రాజకీయ గురువుగా పేర్కొంటూ పరకాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వైద్యుడిగా రోగి నాడిని పట్టిన కాళీ ప్రసాద్‌రావు.. ఇప్పుడు పరకాల ప్రజల రాజకీయ నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీసీ చైతన్యం, విద్య, సామాజిక న్యాయం అనే అంశాలను ముందుకు తీసుకెళ్తూ సాగుతున్న ఆయన రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది వేచి చూడాలి.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.