- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై భగ్గుమన్న కేయూ
- విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
- వందలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ విద్యార్థులు
- లైబ్రరీ నుంచి కేయూ రెండో గేట్ వరకు భారీ ర్యాలీ
- వీసీ భవనం ముట్టడికి యత్నం
- కిటికీలు, పూలకుండీలు ధ్వంసం
- వీసీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- పలువురు నాయకుల అరెస్టు
- ధర్మసాగర్ పీఎస్‌కు తరలింపు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విద్యార్థి నిరుద్యోగులు భగ్గుమన్నారు. కేయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై బుధవారం కేయూలో మహాధర్నా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కేయూ లైబ్రరీ నుంచి రెండో గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వీసీ భవనం వరకు చేరకుని సుమారు గంటపాటు ధర్నా చేశారు. వీసీ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎంతసేపటికీ వీసీ స్పందించకపోవడంతో విద్యార్థులు భవనం లోపలికి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. విద్యార్థులు ఆగ్రహంతో భవనం కిటికీ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇద్దరు విద్యార్థులు భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని విద్యార్థులను నిలవరించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సభకు అనుమతి ఇవ్వకపోవడంతో…
మొదట మార్చి 24న కేయూలో విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభను మార్చి 29 నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ సభకు కేయూ వీసీ అనుమతి ఇస్తానని చెప్పి, తీరా ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతున్నాయంటూ, వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో కేయూలో మహాధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని 12మంది విద్యార్థి జేఏసీ నాయకులను అరెస్టు చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం
సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కేయూ విద్యార్థి సంఘాల జేఏసీ మండిపడింది. వీసీ తాటికొండ రమేష్ తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు. 30లక్షలమంది విద్యార్థి నిరుద్యోగుల భరోసా కై సంఘర్షణ సభను నిర్వహించకుంటామంటే ప్రభుత్వానికి తొత్తుగా వ్యవరిస్తూ సభ రద్దు చేసిన వీసీ తాటికొండ రమేష్ విద్యార్థు నిరుద్యోగుల ఆగ్రహం చవిచూస్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా ధర్నా చేస్తే కూడా నిర్బంధాలకు గురిచేయడం దుర్మార్గమని నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 30లక్షల విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకాలపై నమ్మకం కలగాలంటే టీఎస్‌పీఎస్సీ కమిటీని రద్దు చేసి, చైర్మన్ ని సభ్యులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్, శిక్షణ, భోజన వసతి కల్పించాలన్నారు. 30లక్షల నిరుద్యోగులకు ఒక్కో నిరుద్యోగికి 50వేల రూపాయలు అందిచాలన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొంది సభ నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయ్ ఖన్నా, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజు నాయక్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారి మొగిలి వెంకట్ రెడ్డి , బీఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, ఎన్ఎస్‌యూఐ నాయకుడు అలువాల కార్తీక్, బీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి బొట్ల మనోహర్, ఎన్ఎస్‌యూఐ నాయకుడు రాకేష్ కృష్ణనన్, బీసీ విద్యార్థి సంఘం కె.యూ ఇంచార్జి అరెగంటి నాగరాజు,
పీడీఎస్‌యూ కేయూ ఇన్‌చార్జి కామగోని శ్రవణ్ కుమార్, బీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి కళ్లెపెళ్లి ప్రశాంత్, జాక్ నేతలు కాశీనాథ్, రాచకొండ రంజిత్, రమేష్, మహేష్, అభిరామ్, సంపత్, అర్జున్, భగత్, స్వప్న, సంధ్య, రమ, జ్యోష్ణ, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.