- మాజీ మంత్రి బాబూమోహన్
- గూడూరు మండలంలో ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్ర
- గ్రామాల్లో విస్తృత పర్యటన
పాల్గొన్న కీలక నేతలు - పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
- బీజేపీలో భారీగా చేరికలు
అక్షరశక్తి, గూడూరు : ప్రజా వ్యతిరేక పాలనతో తెలంగాణను అరిగోస పెడుతున్న సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో తగినబుద్ధి చెప్పాలని బీజేపీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ పిలుపునిచ్చారు. ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్రలో భాగంగా మానుకోట నియోజకవర్గంలో గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో గురువారం పూజలు చేసి బైక్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు అరిగోసపడుతున్నారని, ప్రజల కష్టసుఖాలు తెలుసకుంటూ వారికి భరోసా ఇచ్చేందుకే ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, కేవలం మాయమాటలు చెబుతూ తెలంగాణను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ విఫలం చెందారని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.
కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని, నెలలో 15వ తేదీ నాటికి జీతాలు వస్తున్నాయని అన్నారు. ఇలా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, కార్మికులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రజల వద్దకు వచ్చి, వారి సమస్యలు తెలుసుకుంటున్నామని, రానున్న బీజేపీ ప్రభుత్వంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. కాగా, ఫాల్త్యా తండాలో 150 మంది టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ వద్దిరాజు రామచంద్ర రావు, మానుకోట నియోజకవర్గ ఇన్చార్జి కట్టా సుధాకర్, బీజేపీ నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య, వరంగల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి , గూడూరు మండల అధ్యక్షుడు మోతిలాల్, బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.