Monday, September 9, 2024

కేటీఆర్‌.. ముందుగా స‌మాధానం చెప్పు!

Must Read
  • ఉప ఎన్నిక‌ల నుంచి హుజురాబాద్‌కు ఎన్ని నిధులు విడుద‌ల చేశారు?
  • మీతీరు పాతింటికి కొత్త రంగులు వేసినట్లు ఉంది
  • ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్

అక్షరశక్తి, కమలపూర్ : ఉప ఎన్నికల నుంచి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారో మంత్రి కేటీఆర్ ముందుగా స‌మాధానం చెప్పిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టాల‌ని బీజేపీ నేత‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్ క‌మ‌లాపూర్‌, జ‌మ్మికుంట ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో 24గంట‌ల ముంద‌స్తుగానే బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు సోమ‌వారం ఉద‌యం అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, మంత్రి కేటీఆర్ తీరుపై ధ్వ‌జ‌మెత్తారు.
కమలపూర్ మండల కేంద్రంలో ఇది వరకే పూర్తి అయిన భవనాలకు శిలాఫలకలు వేస్తూ ప్రారంభోత్సవాలు చేయడం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన పిలగాని మాటలు వింటూ కేటీఆర్ తన హుందాతనాన్ని దిగజార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్, జమ్మికుంట, కమలపూర్ లో తాను చేసిన అభివృద్ధిని చూసి కేటీఆర్‌కి మతి పోతుందని అన్నారు.

నాకు తెలిసి నేను చేసిన అభివృద్ధిని చూసిపోవడానికే కేటీఆర్ వస్తున్నట్లు అనిపిస్తోంది. నేను చేసిన అభివృద్ధి చూసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్లుగా నన్ను గుండెల్లో ఎలా పదిలపర్చుకున్నారో.. ఉప ఎన్నికలే చెప్పాయి. డబ్బు, మందు ఏరులై పారినా కూడా నన్ను గెలిపించుకున్న తీరు కేటీఆర్‌కి అర్థం అవుతుంది.. అని ఈట‌ల‌ అన్నారు. పగటి వేషగాళ్ల మాటలు విని కేటీఆర్ తన హుందాతనాన్ని దిగజార్చుకోవద్దు అని సూచించారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ 24 గంటల ముందస్తు అరెస్టులను ఎన్నడూ చూడలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలొనే చూస్తున్నామని అన్నారు. త‌మ‌ కార్యకర్తలు అంటే ఎందుకు అంత భయమ‌ని, ఎమ్మెల్సీకి గతం గుర్తుకు వచ్చిందేమో అని ఎద్దేవా చేశారు. కార్యకర్తలకు ఎలాంటి హాని కలిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లదే బాధ్యత అని హెచ్చరించారు. కాగా, బీజేపీ కార్యకర్తలను తెల్లవారు జామున 4 గంటలకు అదుపులోకి తీసుకుని మడికొండ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు సమాచారం.

కేటీఆర్ ప‌ర్య‌ట‌న ఇలా…
క‌మ‌లాపూర్ మండ‌ల కేంద్రంలో ఎంజేపీ బాలిక‌ల హాస్ట‌ల్ ప్రారంభోత్స‌వం మంగ‌ళ‌వారం ఉద‌యం 11గంట‌ల‌కు ఉంటుంది. అక్క‌డి నుంచి ఎస్సీ క‌మ్యూనిటీ ఫంక్ష‌న్‌హాల్‌కు శంకుస్థాప‌న‌. అయ్య‌ప్ప ఆల‌యం ప్రారంభోత్స‌వం. వివిధ కులాల‌కు స‌బంధించిన క‌మ్యూనిటీహాళ్లు ప్రారంభోత్స‌వం. అనంత‌రం జ‌మ్మికుంట‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు భారీ బైక్ ర్యాలీతో వెళ్ల‌నున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img