Saturday, July 27, 2024

సీకేఎంలో వ‌సూళ్లు!

Must Read
  • లైవ్‌బ‌ర్త్ రిపోర్టులో కావాల‌ని అక్ష‌ర‌దోషాలు
  • మేల్ స్థానంలో ఫిమేల్‌.. ఫిమేల్ స్థానంలో మేల్‌గా న‌మోదు
  • త‌ల్లిదండ్రుల పేర్ల‌లోనూ త‌ప్పులు!
  • స‌రిచేయ‌డానికి డ‌బ్బులు వ‌సూలు
  • జీడ‌బ్ల్యూఎంసీకి రిపోర్ట్ పంప‌డంలో నిర్ల‌క్ష్యం
  • లేబ‌ర్‌కార్డు కాన్పు స‌ర్టిఫికెట్ల‌కూ డ‌బ్బులు
  • తీవ్ర ఇబ్బందుల్లో త‌ల్లిదండ్రులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ సీకేఎం ఆస్ప‌త్రిలో సిబ్బంది కొత్త‌రకం దందాకు తెర‌లేపారు. ప్ర‌తీ రోజు వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. డ‌బ్బులు వ‌సూలు చేయ‌డానికి త‌ప్పుడుదారులు ఎంచుకుంటున్నారు. గ‌ర్భిణి ప్ర‌స‌వించిన త‌ర్వాత వారికి ఇచ్చే లైవ్ బ‌ర్త్ రిపోర్టులో కావాల‌ని అక్ష‌ర‌దోషాల‌తో త‌ప్పులు రాస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అదే రిపోర్టును గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు పంపుతుండ‌డంతో బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తీసుకునే క్ర‌మంలో త‌ల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌ళ్లీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ఆస్ప‌త్రికి పేర్ల‌ను స‌రి చేయించుకోవ‌డానికి వ‌చ్చిన వారి నుంచి, చివ‌రికి లేబ‌ర్ కార్డు ఉన్న‌వారికి కాన్పు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి కూడా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.                                              దందా సాగుతుంది ఇలా..!
సీకేఎం ఆస్ప‌త్రికి వ‌రంగ‌ల్‌తోపాటు అనేక ప్రాంతాల నుంచి ప్ర‌స‌వం కోసం గ‌ర్భిణులు వ‌స్తున్నారు. ప్ర‌స‌వం త‌ర్వాత డిశ్చార్జ్ స‌మ‌యంలో వారికి ఆస్ప‌త్రి సిబ్బంది లైవ్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే రిపోర్టు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు పంపించాలి. అయితే.. సీకేఎం ఆస్ప‌త్రిలో సిబ్బంది డ‌బ్బుల కోసం అడ్డ‌దారులు తొక్కుతున్నారు. లైవ్‌బ‌ర్త్ రిపోర్టులో కావాల‌ని అక్ష‌ర దోషాల‌తో పేర్లు త‌ప్పుగా రాస్తున్నారు. అంతేగాకుండా, పాప స్థానంలో బాబు అని, బాబు స్థానంలో పాప అంటూ రాసి ఇస్తున్నారు. ఇదే రిపోర్టును జీడ‌బ్ల్యూఎంసీకి పంపించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత జీడ‌బ్ల్యూఎంసీ సిబ్బంది ఆ రిపోర్టును ఆన్‌లైన్‌లో పొందుప‌రుస్తారు. అప్పుడు మాత్ర‌మే మీ సేవ నుంచి బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే.. సీకేఎం ఆస్ప‌త్రి సిబ్బంది స‌కాలంలో జీడ‌బ్ల్యూఎంసీకి రిపోర్టు పంపక‌పోవ‌డం, ఒక‌వేళ పంపినా పేర్లు త‌ప్పుగా ఉండ‌డంతో త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ సీకేఎం ఆస్ప‌త్రికి రావాల్సి వ‌స్తోంది. వ్య‌య‌ప్ర‌యాసాల కోర్చి ఆస్ప‌త్రికి వ‌చ్చిన వారికి సిబ్బంది చుక్క‌లు చూపిస్తున్నారు. త‌ప్పులు స‌రిదిద్ద‌డానికి ఖ‌ర్చు అవుతుందంటూ బ‌హిరంగంగానే వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కొక్క‌రి నుంచి సుమారు రూ.500 నుంచి రూ.వెయ్యి వ‌ర‌కు వ‌సూలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.              ఆస్ప‌త్రి ఎదురుగానే మీసేవ సెంట‌ర్‌..
ఇదంతా ఇద్ద‌రు ముగ్గురు సిబ్బంది క‌లిసి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిగో.. మ‌న ఆస్ప‌త్రి ఎదురుగానే మీ సేవ సెంట‌ర్ ఉంటుంది.. అక్క‌డికి వెళ్లి మా పేరు చెప్పండి.. వారే చూసుకుంటారు. ఇదంతా చేయ‌డానికి ఖ‌ర్చు అవుతుందంటూ మ‌ళ్లీ మీ సేవ సెంట‌ర్‌లోనూ మ‌ళ్లీ డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. కొంద‌రి లైవ్ బ‌ర్త్ రిపోర్టును నెల‌ల కొద్దీ జీడ‌బ్ల్యూఎంసీకి పంప‌క‌పోవ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికీ కొంద‌రు ఆస్ప‌త్రి చుట్టూ తిరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. మార్చి నుంచి గ‌ర్భిణి ప్ర‌స‌వించిన 24 గంట‌ల్లోనే లైవ్ బ‌ర్త్ రిపోర్టును జీడ‌బ్ల్యూఎంసీకి పంపించాలంటూ నిబంధ‌న‌లు వ‌చ్చినా సిబ్బంది ప‌నితీరులో మాత్రం మార్పు రావ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.                                      దందా కోసం కుమ్మ‌క్కు..!
ప్ర‌స‌వించిన 24గంట‌ల్లోనే లైవ్ బ‌ర్త్ రిపోర్టును జీడ‌బ్ల్యూఎంసీకి పంపించాలంటూ మార్చి చివ‌రి వారంలో కొత్త నిబంధ‌న‌లు వ‌చ్చాయి. అయితే.. ఆ స‌మ‌యంలో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కోసం ఒక డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పేరును ఇవ్వాలంటూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సిబ్బంది చెప్ప‌గా.. సీకేఎం ఆస్ప‌త్రి నుంచి త‌ప్పుడు స‌మాచారంతో దందాకు ఉప‌యోగ‌ప‌డే ఇత‌ర విభాగానికి చెందిన వ్య‌క్తి పేరు సూచించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆస్ప‌త్రిలో ప‌రిస్థితి ఇంత అస్త‌వ్య‌స్తంగా ఉన్నా.. ఆస్ప‌త్రికి వ‌చ్చిన వారిని ఇలా పీడిస్తున్నా.. ఆస్ప‌త్రి ఉన్న‌తాధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. పేద‌ల‌ను ఇలా ఇబ్బంది పెట్ట‌డంపై తీవ్ర ఆసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img